IBM వచ్చేసింది: వైజాగ్ ఆఫీస్ ఇదే! మంత్రి లోకేష్ ట్వీట్ వైరల్.
సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం ఇప్పుడు గ్లోబల్ ఐటీ హబ్‌గా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ సంస్థ IBM తన నూతన కార్యాలయాన్ని విశాఖలోని ప్రతిష్టాత్మకమైన లాన్సమ్ స్క్వేర్ (Lansom Square) భవనంలో ఏర్పాటు చేసింది. ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ 'iSprout' భాగస్వామ్యంతో ఈ సెంటర్ కార్యకలాపాలు సాగనున్నాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని 'X' వేదికగా ధృవీకరిస్తూ.. #ChooseSpeedChooseAP హ్యాష్‌ట్యాగ్‌తో IBMను సాగరనగరానికి సాదరంగా ఆహ్వానించారు.
గత కొన్నేళ్లుగా ఐటీ కంపెనీల రాక లేక వెలవెలబోయిన విశాఖకు, IBM రాక కొత్త ఊపిరి పోసింది. సాధారణంగా IBM వంటి దిగ్గజ సంస్థ ఒక నగరంలో అడుగుపెట్టిందంటే, దానిని అనుసరించి అనేక అనుబంధ సంస్థలు, ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు (MNCs) కూడా అటువైపే మొగ్గు చూపుతాయి. ఇది విశాఖను ఐటీ గమ్యస్థానంగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.

Welcome to #Vizag, IBM! #ChooseSpeedChooseAP @IBM pic.twitter.com/tgZ1OLQAUS
— Lokesh Nara (@naralokesh) April 12, 2026
ఉత్తరాంధ్ర యువతకు గొప్ప అవకాశం..
IBM తన గ్లోబల్ డెలివరీ సెంటర్ల ద్వారా సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. తాజా సెంటర్ ప్రారంభంతో వందలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు స్థానికంగానే ఉపాధి లభించనుంది. ఫలితంగా ఉత్తరాంధ్రకు చెందిన యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా, సొంత గడ్డపైనే అంతర్జాతీయ స్థాయి కెరీర్‌ను నిర్మించుకునే అవకాశం లభించింది.
లోకేష్ స్పెషల్ ఫోకస్.. ఫలిస్తున్న ప్రయత్నాలు..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి లోకేష్ స్వయంగా అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుండటం, ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత ఉండటంతో ఫలితాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. IBM రాకతో విశాఖ ఐటీ రంగం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఐటీ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications