ఎవరి భూమి ఎవరికి పంచుతారు?... తుళ్లూరులో ఉద్రిక్తత
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తుంటే సిగ్గేస్తోందని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. అమరావతి రైతులకు మద్దతుగా శ్రవణ్ కుమార్ దీక్షకు దిగగా పోలీసులు అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు జగన్ తూట్లు పొడుస్తున్నారని, అమరావతి రైతులకు బాసటగా నిలబడటం తమ ప్రాథమిక హక్కు అన్నారు. దీక్షకు కూర్చుంటే పోలీసులతో భగ్నం చేయిస్తారా? ఎవరి భూమిని ఎవరికి పంచుతారని ప్రశ్నించారు.
పేదలపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ స్థలంలో 5 సెంట్లు ఇవ్వాలన్నారు. తన దీక్షకు మద్దతుగా తుళ్లూరు శిబిరం వద్దకు తరలివచ్చిన మహిళలు, రైతులకు శ్రవణ్ కుమార్ వందనాలు తెలియజేశారు. అమరావతిని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఇదే మన భవిష్యత్తు అని స్పష్టం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండం ఇచ్చే హక్కు తమకు లేదా? అని ప్రశ్నించారు.

అరెస్ట్ లకు వ్యతిరేకంగా జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశం, నిరసనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బడుగు బలహీన వర్గాలు ప్రస్తుత ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈనెల 26వ తేదీన జరగబోయే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, సోషల్ మీడియా ద్వారా ఇంటిదగ్గర నుంచే నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ స్మృతి వనానికి న్యాయస్థానం అనుమతి తీసుకుని వెళ్తానని, పాదయాత్రతోపాటు దీక్ష కూడా చేస్తానని శ్రవణ్ తెలిపారు.
ఆర్5 జోన్ లో రాజధాని నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో పేదలకు ఇంటి స్థలాల కింద ఎలా ఇస్తారని అమరావతి రైతులు ప్రశ్నించారు. అధికార, ప్రతిపక్షాలు ర్యాలీలకు పిలుపునివ్వడంతో పోలీసులు తుళ్లూరులో 144 సెక్షన్ విధించారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ నిరసన దీక్షకు పిలుపునివ్వగా, ఆర్-5 జోన్‌కి మద్దతుగా వైసీపీ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ చేయాలని నిర్ణయించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే అనుమానంతో పోలీసులు తుళ్లూరులో ముందస్తుగానే 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయడంతోపాటు రైతుల దీక్షా శిబిరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications