క్షమించరు: చంద్రబాబుపై జగదీష్, ఆ నేతలను ఎంతకు కొన్నారన్న కర్నె
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తెలంగాణ మంత్రులు, టిఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు విశ్వసించరని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను బాబు పదే పదే మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణకు ప్రతీ విషయంలో ద్రోహం చేస్తున్న బాబును ఇక్కడి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు అని స్పష్టం చేశారు. బాబు తెలంగాణ రైతాంగం ఉసురుపోసుకుంటున్నాడని అన్నారు. కరీంనగర్‌లో చంద్రబాబు కరెంట్‌పై మాట్లాడుతున్న సమయంలోనే ఢిల్లీలో సమావేశమైన కమిటీలో తెలంగాణకు కరెంట్ ఇవ్వమని ఏపీ అధికారులు తేల్చిచెప్పారని గుర్తు చేశారు. 8 నెలలుగా తెలంగాణ ప్రభుత్వాన్ని బాబు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
కార్పోరేషన్ల విభజన, గోదావరి, కృష్ణా జలాల విషయంలో కూడా బాబు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హైకోర్టు విభజన విషయంలో భారతీయ జనతా పార్టీ నేతల వైఖరి సరిగా లేదన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు హైకోర్టు విడిపోవాల్సిందేనని చెప్పి, ఇప్పుడు హైకోర్టు విభజనను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు విషయంలో బిజెపి తన వైఖరిని ఇప్పటి వరకు స్పష్టం చేయలేదని అన్నారు.

ఆ నేతలను ఎంతకు కొన్నారు: కర్నె
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇతర పార్టీ నేతలను టిఆర్ఎస్ కొంటుందని తమపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపి ఎస్‌పివై రెడ్డి, జూపూడి ప్రభాకర్ లాంటి నేతలను ఎంతకు కొన్నారో చెప్పాలని కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌కు చంద్రబాబు చేసింది ఏమీలేదని అన్నారు. హైదరాబాద్‌ను గుడిసెల నగరంగా మార్చింది చంద్రబాబేనని... వ్యవసాయం దండగ అన్న బాబు... ఇప్పుడు వ్యవసాయంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు వ్యవసాయం మరిచిపోయేలా చేసింది చంద్రబాబే అని తెలిపారు.
వ్యవసాయం దండుగ అన్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నీటి, కరెంట్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications