విశాఖ రుషికొండ తవ్వకాలపై సుప్రీంకు జగన్ సర్కార్-ఎన్టీటీ ఆదేశాల సవాల్
ఏపీ కార్యనిర్వహక రాజధానిగా వైసీపీ సర్కార్ ఎంపిక చేసిన విశాఖపట్నంలో రుషికొండ తవ్వకాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ తవ్వకాలపై ఇప్పటికే జాతీయ హరిత ట్రైబ్యునల్ జోక్యం చేసుకుని స్టే విధించింది. అయితే దీన్ని ఇవాళ జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
రుషికొండ తవ్వకాలపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖలో రుషికొండ తవ్వకాలపై గతంలో ఎన్జీటీ ధర్మాసనం స్టే విధించింది. గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పర్యావరణ అనుమతులన్నీ పొందిన తర్వాతే రుషికొండలో తవ్వకాలను చేపట్టినట్లు ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా తవ్వకాలు, నిర్మాణాలు చేపడతామని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

అంతకముందు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గతేడాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 6న ఎన్జీటీ విచారణ జరిపింది. తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు సంయుక్త కమిటీని నియమించింది. నెల రోజుల్లో నివేదిక అందించాలని కమిటీకి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి తవ్వకాలూ జరపరాదని ఎన్జీటీ ఆదేశించింది. ఇది వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారింది. దీంతో ఎన్టీటీ ఉత్తర్వుల్ని వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రుషికొండ తవ్వకాలపై త్వరలో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులు విశాఖలోనూ కీలకంగా మారాయి.












Click it and Unblock the Notifications