ఉద్యోగులతో ఏపీ సర్కార్ చర్చలు మళ్లీ విఫలం-పీఆర్సీ నివేదిక ఇవ్వలేం- జగన్ హామీ మాత్రం
ఏపీలో ఉద్యోగసంఘాలతో ప్రభుత్వ చర్చలు మళ్లీ విఫలమయ్యాయి. ఇవాళ అమరావతి సచివాలయంలో నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు కోరుతున్న విధంగా పీఆర్సీ నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం ససేమిరా అంది. దీంతో ఏ ఫలితం తేలకుండానే సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.
ఇవాళ ఉదయం తిరుపతిలో తనను కలిసిన ఉద్యోగులతో సీఎం జగన్ పది రోజుల్లో పీఆర్సీ ఇస్తామని స్పష్టం చేశారు. దీనిపై మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం పిలిచిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీకి హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున కార్యదర్శులు హాజరైన ఈ భేటీలో తిరిగి పీఆర్సీ నివేదిక అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే కార్యదర్శులు మాత్రం దీనిలో సాంకేతిక అంశాలపై అధ్యయనం చేస్తున్నామని ఉద్యోగసంఘాలకు తెలిపారు. దీంతో ఇప్పుడు పీఆర్సీ నివేదిక ఇవ్వలేమన్నారు.

కార్యదర్శుల వ్యాఖ్యలతో ఉద్యోగ సంఘాలు షాకయ్యాయి. పీఆర్సీ నివేదిక కూడా ఇవ్వలేనప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఎందుకు నిర్వహించారని ప్రశ్నించాయి. ఉదయం సీఎం జగన్ ఇచ్చిన హామీని ప్రస్తావించాయి. దీంతో సీఎం జగన్ చెప్పినట్లుగా పది రోజుల్లో ఈ నివేదిక ఇస్తామని కార్యదర్శులు ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. దీంతో పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా చర్చలు ఎలా సాధ్యమని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పీఆర్సీ నివేదికపైనా స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ నుంచి వెళ్లిపోయాయి. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు... 71 అంశాలతో వినతి పత్రం ఇచ్చామని, కానీ కార్యదర్శుల కమిటీ మాత్రం కాలయాపన చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చి చెప్పేవరకూ తాము ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.
Recommended Video
వాస్తవానికి పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. పీఆర్సీ నివేదికను సైతం ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని ప్రశ్నిస్తున్నాయి. దీనికి ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు. అయితే ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ చెప్పినట్లుగా పది రోజుల్లో నివేదిక బహిర్గతమయ్యే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. కానీ పీఆర్సీ అమలు ఎప్పుడన్నది మాత్రం తేలడం లేదు.












Click it and Unblock the Notifications