నారా లోకేష్ కోసమేనా?: చంద్రబాబుకు జగన్ ఫోబియా!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎదురులేకుండా చేసేందుకే టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం, మిగితా పార్టీలు బలహీనంగా ఉండటం టిడిపికి కలిసి వచ్చే అంశం. ఇక బిజెపి.. తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉండటంతో ఆ పార్టీతో ప్రస్తుతానికి తమ పార్టీకి వచ్చే ముప్పేమీ లేదని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేయడం ద్వారా తనకి, తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్‌కి, పార్టీకి, ప్రభుత్వానికి భవిష్యత్‌లో జగన్మోహన్ రెడ్డి వలన ఎటువంటి సవాళ్లు ఎదురవకూడదని చంద్రబాబు నాయుడు భావిస్తునట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని అంటున్నారు వైసీపీ నేత బి మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న ఆయన.. మండల బీసి సెల్ కన్వీనర్ నాగాభూషణ్ యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. జగన్ ఫోబియా కారణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకునే పనిలో మునిగితేలుతున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రే అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఊరుకొంటారా? వారు కూడాయదేచ్చగా వివిధ పథకాలు, ప్రాజెక్టుల ముసుగులో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.
అయితే, ముఖ్యమంత్రికి జగన్ ఫోబియా ఉందనే వారి వాదనలో నిజముందో లేదో తెలియదు గానీ, చంద్రబాబు మాత్రం కొంత జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి తనకు ఏ విషయంలోనూ సరితూగడని చంద్రబాబు చెబుతున్నప్పటికీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీలోని ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను వరుస పెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications