వైసీపీలో అతని ఓటమి అసలు ఊహించలేదు - కేటీఆర్
గతేడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీని ఎదుర్కోవాలంటే సింగిల్‌గా పోటీ చేస్తే కష్టమని భావించిన నేతలు కూటమిగా ఏర్పడ్డారు. టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. కూటమి పార్టీలు 164 సీట్లలో విజయం సాధించాయి. ఇంతటి భారీ విజయాన్ని కూటమి నేతలు సైతం ఊహించలేకపోయారు.
ఇంత దారుణ ఓటమిని వైసీపీ నేతలెవ్వరు కూడా జీర్ణించుకోలేక పోయారు. వైసీపీ ఓటమిని అధినేత జగన్ సైతం ఊహించలేకపోయారు.2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని రికార్డు విజయంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ , 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించ లేకపోయింది.

తాజాగా వైసీపీ ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్ జగన్ ఓటమిపై స్పందించారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం నాకు ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్ తెలిపారు. ఓడినా 40 శాతం ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు.
ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు మరోలా ఉండేవని ఆయన వెల్లడించారు.జగన్‌ను ఓడించేందుకు షర్మిలను పావులా వాడుకున్నారని , అంతకు మించి ఆమె పాత్ర పెద్దగా ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతిరోజు జనంలో తిరిగే కేతిరెడ్డి సైతం ఓడిపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందని కేటీఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications