చంద్రబాబు అరెస్ట్ - ఎన్నికల వేళ జగన్ కు లాభమా, నష్టమా..!!
ఏపీలో రాజకీయాల్లో అనూహ్య మలుపు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ సంచలనంగా మారింది. ఎన్నికల వేళ ఈ పరిణామం కొత్త సమీకరణాలకు కారణం అవుతోంది. ఇది రాజకీయంగా చంద్రబాబుకు కలిసి వస్తుందనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో వస్తున్న ప్రతిస్పందన..జరుగుతున్న పరిణామాలతో వైసీపీకి లాభం కలిగేనా..నష్టం చేస్తుందా అనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, ఈ మొత్తం పరిణామం వెనుక ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ తో : చంద్రబాబు అరెస్ట్ ఇప్పుడు రాజకీయంగా కీలక అంశంగా మారుతోంది. చంద్రబాబు అరెస్ట్ గురించి ఇప్పటికే స్వయంగా చంద్రబాబే సంకేతాలు ఇచ్చారు. అయితే, అటు టీడీపీ..ఇటు వైసీపీ చంద్రబాబు సంకేతాలను సీరియస్ గా తీసుకోలేదు. సింపథీ కోసమే చంద్రబాబు ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అంచనా వేసారు. కానీ, ఈ ఉదయం చంద్రబాబు అరెస్ట్ వార్తతో ఒక్క సారిగా టీడీపీతో పాటుగా వైసీపీ నేతలకు ఒక దశలో అర్దం కాలేదు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ చంద్రబాబును అరెస్ట్ చేస్తే అది రాజకీయంగా తమకు కలిసి వస్తుందనే లెక్కలు టీడీపీ వేస్తే...తమకు నష్టం కలగదా అనే సందేహాలు వసీపీ నేతల్లోనూ కనిపించాయి. కానీ, జగన్ లెక్కలే వేరు అన్నట్లుగా సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి.

రాజకీయంగా ఏం జరిగేను : ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో విచారణ సంస్థలు పూర్తిగా ఆధారాలు సేకరించినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే, రాజకీయంగా లాభ నష్టాల కంటే చంద్రబాబు అవినీతిని ప్రధానంగా ప్రజల్లోకి..మద్దతు పార్టీల్లోకి తీసుకెళ్లాలనేది ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. ఎంతో కాలంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం గురించి చర్చ సాగుతున్నా...చంద్రబాబు ప్రమేయం గురించి నేరుగా అసెంబ్లీలోనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా చర్యల దిశగా అడుగులు వేయలేదు. తాజాగా చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారంలో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. చంద్రబాబు అవినీతి గురించి చర్చ సాగుతున్న సమయంలోనే..ఇప్పుడు అనూహ్యంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చర్యలు మొదలయ్యాయి.
కొత్త వ్యూహాలతో ముందుకు : ఎన్నికల సమయంలో రాజకీయంగా ఆలోచన చేస్తూ ఈ అరెస్ట్ జరిగేది కాదనే అభిప్రాయం ఉంది. చంద్రబాబు అవినీతి గురించి ప్రధానంగా ప్రస్తావన చేయటం ద్వారా మద్దతు ఇస్తారని భావిస్తున్న పార్టీలను ఆలోచనలోకి నెట్టటం మరో లక్ష్యంగా కనిపిస్తోంది. చంద్రబాబు ప్రమేయం..అవినీతి గురించి ఆధారాలు బయట పెడితే రాజకీయంగా ఎటువంటి నష్టం ఉండదనే నమ్మకం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన ఇప్పటి వరకు చంద్రబాబు అరెస్ట్ తీరు ఖండించటం మినహా.. అసలు చంద్రబాబు అవినీతి చేయలేదని చెప్పకపోవటాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు అధికార - ప్రతిపక్ష పార్టీల నుంచి రాజకీయంగా చోటు చేసుకొనే పరిణామాలు..వ్యూహాలు మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications