జగిత్యాల అసెంబ్లీ: టిడిపి అభ్యర్థి రమణకు అగ్నిపరీక్ష

జగిత్యాల నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా 9సార్లు కాంగ్రెస్ గెలుపొందింది. నాలుగుసార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. పోటీలో ఉన్న ముగ్గురు మూడు ప్రధాన సామాజికవర్గాలకు చెందిన వారు కావడం ఇక్కడ విజయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. 1983లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవన్‌రెడ్డి 1989, 1996, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2009 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
2006, 2008 కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నిక బరిలోకి దిగి ఓటమిపాలైనా జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం ఆధిక్యత సాధించి పట్టు నిలుపుకొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో మండలాలు మారడంతో 2009లో జరిగిన ఎన్నికల్లో జీవన్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు విజయానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. బలమైన నేత కావడం, ప్రజలకు అందుబాటులో ఉండటం, గత ఎన్నికల్లో ఓటమి ద్వారా సానుభూతి ఉండటం, తెలంగాణ ఉద్యమం నేపథ్యం జీవన్‌రెడ్డికి కలిసి వస్తాయని భావిస్తున్నారు.
తెలంగాణ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ఎల్. రమణకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. జిల్లాకు చెందిన ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలంగాణ నేపథ్యంలో పార్టీని వీడినా రమణ మాత్రం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా పార్టీలో కొనసాగుతున్నారు. బిసి సామాజికవర్గానికి చెందిన రమణకే చంద్రబాబు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. 1994లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన రమణ చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూనే 1996లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి బీసీ కార్డుతో విజయం సాధించారు.
1998లో ఓటమి పాలైన రమణ తిరిగి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బీసీ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం, బలమైన కేడర్ ఉండటం, నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి రమణకు కలిసి వస్తున్న అంశాలు. అయితే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనకపోవడం ఆయనపై విమర్శలకు తావిస్తోంది. బిసీల ఓట్లతో గట్టెక్కే దిశగా రమణ పావులు కదుపుతున్నారు.
తెలంగాణ సెంటిమెంట్ ద్వారా తొలిసారిగా జగిత్యాలలో పాగా వేయాలని గులాబీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి సత్తా చూపించడానికి సన్నద్ధమవుతున్నారు. జీవన్‌రెడ్డి, రమణ మధ్యనే పోటీ ఉంటుందని భావించినప్పటికీ సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే సంజయ్‌కుమార్ తెరపైకి రావడంతో ముక్కోణపు పోరు జరుగుతుందని అంచనాలు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications