రాజీనామా దిశగా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి...!?
కడప జిల్లా కేంద్రంగా రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల సుదీర్ఘ చర్చల తరువాత జెడ్పీ ఛైర్మన్లను ప్రకటించారు. కడప జిల్లా జెడ్పీ పీఠం పైన బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి తన సోదరుడి కుమారుడి కోసం చివరి వరకు ప్రయత్నించారు. ఒక దశలో హామీ పొందినట్లు వార్తలు వచ్చాయి. కాగా, చివరకు కడప జెడ్పీ సీటు టీడీపీ నేత పుత్తా నరసింహా రెడ్డికి ఖరారైంది. దీంతో.. ఆదినారాయణ రెడ్డి రాజీనామాకు సిద్దపడినట్లు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కాగా, మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆదినారాయణ రెడ్డి చేసే ప్రకటన పైన ఉత్కంఠ నెలకొంది.
కడప జిల్లా సీనియర్ నేత.. జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. కడప జెడ్పీ సీటు పుత్తా నరసింహా రెడ్డికి కేటాయించటంతో ఆదినారాయణ రెడ్డి గుర్రుగా ఉన్నారు. దీంతో.. ఆయన రాజీనామా దిశగా ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో.. తన మద్దతు దారులతో కలిసి విజయవాడ కు చేరుకున్నారు. కాసేపట్లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆదినారాయణ రెడ్డితో పాటుగా జమ్మలమడుగు, ముద్దనూరు, ఎర్రగుంట్ల జడ్పీటీసీలతో రాజీనామా చేసే యోచనలో నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో, ఆదినారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం పై ఉత్కంఠ కొనసాగుతోంది.

జెడ్పీ ఛైర్మన్ ప్రకటన వచ్చిన తరువాత హుటాహుటిన రాత్రికి రాత్రి విజయవాడ వెళ్ళిన ఆదినారా యణ రెడ్డి, ఆయన అనుచరులు కీలక మంత్రాంగం నిర్వహించారు. తన సోదరుడి కుమారుడు రాజేష్ రెడ్డి కి జిల్లా పరిషత్ చైర్మన్ ఆశించి భంగపడ్డ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఆసక్తిగా మారుతోంది. వైసీపీ నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత టీడీపీ లో మంత్రిగా పని చేసారు. తిరిగి 2024 లో బీజేపీ నుంచి గెలిచినా... స్థానిక ఎన్నికల్లో జిల్లాలో ప్రత్యేకంగా పులివెందులలో వైసీపీని ఓడించటంలో కీలకంగా వ్యవహరించారు. తన సోదరుడు కుమారుడు డాక్టర్ చదిపిరాళ్ల రాజేష్ రెడ్డికి ఇవ్వాలని కోరుతూ వచ్చారు. అయితే, బీజేపీకి కూటమి చర్చల్లో క్రిష్ణా జిల్లా దక్కింది. కడప నుంచి పుత్తా నరసింహారెడ్డి పేరు ప్రకటించారు. దీంతో.. ఇప్పుడు ప్రచారం సాగుతున్నట్లుగా ఆదినారాయణ రెడ్డి రాజీనామా చేస్తారా.. రాజకీయంగా ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications
