వలసలు: తెరాసలోకి జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్?
హైదరాబాద్: పార్టీ అధిష్టానంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత కె. జానారెడ్డి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరే అవకాశం ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయనతో నల్లగొండ జిల్లాకే చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా తెరాసలోకి వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరాసలో చేరుతారని ప్రచారం సాగుతోంది. జానారెడ్డితో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ నెల 25వ తేదీన తెరాస తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. నకిరేకల్ శాసనసభ్యుడు లింగయ్య, ఆలేరు శాసనసభ్యుడు బిక్షమయ్య గౌడ్ కూడా తెరాసలోకి వస్తారని అంటున్నారు. వీరితో పాటు మరింత మంది నల్లగొండ జిల్లా నేతలు తెరాసలోకి వస్తారని అంటున్నారు.

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా తనను నియమిస్తూ మొదట చెప్పి, ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్యకు ఆ పదవి ఇవ్వడంతో జానారెడ్డి తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. దానికితోడు, నల్లగొండ జిల్లాకే చెందిన మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.
దానికి తోడు, కాంగ్రెసు తెలంగాణలో అధికారంలోకి వస్తే బిసి నేతను ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ చేసిన ప్రకటన జానారెడ్డి బాధించినట్లు చెబుతున్నారు తన సీనియారిటనీ, నిజాయితీనీ కాంగ్రెసు అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, సిట్టింగ్ అయిన తనను కాదని భువనగిరి లోకసభ స్థానాన్ని పొన్నాల లక్ష్మయ్యకు ఇవ్వాలని అధిష్టానం ఆలోచన చేస్తుండడం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అసంతృప్తికి గురి చేసినట్లు చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కావడంతో నల్లగొండ జిల్లా రాజకీయ సమీకరణాలు మారాయి. దీంతో నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు కొద్ది ఎమ్మెల్యేలు తెరాసలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
వారందరికీ కెసిఆర్ ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్లు కూడా చెబుతున్నారు. కెసిఆర్ పంపిన ఆహ్వానాన్ని వారు పరిశీలిస్తున్నారని, త్వరలోనే వారు నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications