ఏమిటిది కిరణ్, అప్పుడలా..ఇప్పుడిలానా: జానా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పలుమార్లు చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు సిడబ్ల్యుసి నిర్ణయాన్ని వ్యతిరేకించడం సమంజసం కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై సిడబ్ల్యుసి నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలనే సిఎం సూచనను ఆయన తప్పు పట్టారు.
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం అకస్మాత్తుగా తీసుకోలేదని, అందరి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే తీసుకుందని, సుదీర్ఘ పోరాటాల తర్వాత తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేవలం సీమాంధ్ర సమస్యలను మాత్రమే చెప్పారని, తెలంగాణ సమస్యలను కూడా చెప్పి సమస్య పరిష్కారానికి సూచన చేయాల్సి ఉండిందని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో రెచ్చగొట్టినా ప్రభుత్వానికి నష్టం జరగకుండా, ముఖ్యమంత్రికి ఇబ్బంది కలగకుండా తాము వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణపై తాము అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూశామే తప్ప ఏ విధమైన ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించలేదని ఆయన అన్నారు.
సీమాంధ్ర ప్రజలు సమైక్యాంధ్ర కావాలంటున్నారు, తెలంగాణావాళ్లు విభజన కావాలంటున్నారని, ఏ ప్రాంత నిర్ణయాన్ని అమలు చేయాలి, దాన్ని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి ఏం చేయాలో చెప్పాల్సి ఉండిందని ఆయన అన్నారు. 60 ఏళ్లుగా నలుగుతున్న తెలంగాణ సమస్యకు పరిష్కారాన్ని ముఖ్యమంత్రి సూచించాల్సి ఉండిందని ఆయన అన్నారు. సీమాంధ్ర పక్షాన మాత్రమే ముఖ్యమంత్రి మాట్లాడారని ఆయన అన్నారు. ప్రజా నిర్ణయమంటే ఏ ప్రాంత ప్రజల నిర్ణయమో చెప్పాలని ఆయన అడిగారు.
ముఖ్యమంత్రి మాటలు ఓ ప్రాంతం ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. కష్టనష్టాలను ముఖ్యమంత్రి చెప్పడంలో తప్పు లేదు గానీ రెండు ప్రాంతాల సమస్యలను చెప్పాలని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడాలని ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రాంతం ప్రజలు రెండింతలుగా పోరాడాలని అనుకోరా అని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి మాటల వల్ల తెలంగాణ ప్రాంత నాయకులు, ప్రజలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు ప్రస్తుత పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసునని ఆయన అన్నారు.
సమైక్యంగా ఉండడానికి జరిగిన ప్రయత్నాలు తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచలేకపోయాయని, అనుమానాలూ అపోహలు పెరిగాయని, దాంతో తెలంగాణలో ఆరాటం ఆగిపోలేదని, అసంతృప్తి తగ్గలేదని, దాంతో 60 ఏళ్లుగా ఏదో రూపంలో ఉద్యమం తలెత్తుతూనే ఉందని, ఆ సమస్యను పరిష్కరించడానికే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications