మరో 20ఏళ్లైనా వచ్చేదికాదు, మావల్లే: కెసిఆర్‌పై జానా
హైదరాబాద్: ఇద్దరు, ముగ్గురు పార్లమెంటు సభ్యులున్న వారు మరో ఇరవై ఏళ్లు ఉద్యమించినా తెలంగాణ వచ్చేది కాదని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అందరి పాత్ర ఉన్నప్పటికీ, తమ పాత్ర అధికమన్నారు. తాము ఉద్యమించకుంటే వచ్చేదే కాదన్నారు.
కాంగ్రెసు పార్టీ అనుకుంది కాబట్టే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీని గెలిపించి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇద్దరు ముగ్గురు ఎంపీలున్న పార్టీకి తెలంగాణ తేవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కాంగ్రెసు చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. ఉద్యమంలో కాంగ్రెసు పార్టీ పాల్గొన్నదని చెప్పారు.

ఎన్నికలలో గెలిచే సత్తా తమకు ఉందన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణం, సామాజిక తెలంగాణ కాంగ్రెసు పార్టీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి విలీనమా లేక పొత్తా తాము పట్టించుకోమన్నారు. అధికారం కోసం తాము వెంపర్లాడటం లేదని చెప్పారు. పొత్తుల పైన తమ దృష్టి లేదని, కాంగ్రెసు ఒంటరిగా గెలుస్తుందని చెప్పారు.
మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపిలో చేరడంపై కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. కేంద్రమంత్రిగా పురంధేశ్వరి ఎన్ని రోజులు ఏఐసిసి సమావేశానికి హాజరయ్యారని ప్రశ్నించారు. ఏడెనిమిదేళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీలు మారారని మండిపడ్డారు. తెలంగాణ రానప్పుడు కాంగ్రెసు పార్టీకి అపకీర్తి మూటగట్టారని, ఇప్పుడు కాంగ్రెసు ఇచ్చినందువల్ల కీర్తి కూడా తమ పార్టీదే అన్నారు. టిడిపికి మద్దతిచ్చే విషయంలో బిసి నేత ఆర్ కృష్ణయ్య పునరాలోచించుకోవాలని, తాను నిజామాబాద్ నుండే పోటీ చేస్తానని మధుయాష్కీ చెప్పారు.
జానాను పిసిసి అధ్యక్షులుగా చేయాలని లేఖ
జానా రెడ్డిని తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా చేయాలని తెలంగాణ డిసిసి అద్యక్షులు అధిష్టానానికి లేఖ రాశారు. నీతి, నిజాయితి, సీనియర్ అయిన జానాకు అప్పగిస్తే పార్టీ గెలుపు ఖాయమని వారు పేర్కొన్నారు.
పొత్తు వద్దని అధిష్టానానికి లేఖ
తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు వద్దని, ఒంటరిగా ఎన్నికలకు వెళ్దామని తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేతలు అధిష్టానానికి లేఖ రాశారు. ఏ ఎన్నికల్లోను తెరాసతో పొత్తు వద్దని వారు లేఖలో కోరారు.












Click it and Unblock the Notifications