కేబినెట్ హోదాతో నాగబాబు బోణి! ఛార్జ్ తీసుకున్న వేళ పవన్ ప్రత్యేక శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రీచ్‌మెంట్ (ఏపీ గ్రీన్) సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా జనసేన పార్టీ శాసన మండలి సభ్యుడు కొణిదెల నాగబాబు శుక్రవారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజల నడుమ ఆయన తన నూతన బాధ్యతలను చేపట్టగా, అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనం పెంపొందించే ఈ కీలక పదవిలో నాగబాబుకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది.
2047 నాటికి 50 శాతం పచ్చదనమే లక్ష్యం
రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, భవిష్యత్ తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్ అందించాలనే బృహత్తర సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఈ ఏపీ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. 2047 నాటికి రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని ఏకంగా 50 శాతానికి పెంచడమే ప్రధాన ధ్యేయంగా నాగబాబు ముందుండి ఈ సంస్థను నడిపించనున్నారు. ప్రకృతి పరిరక్షణపై ఉన్న పట్టుతో, ఈ మహత్తర లక్ష్యాన్ని ఆయన సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.

శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తన సోదరుడు నాగబాబుకు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పచ్చదనంతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించే ఏపీ గ్రీన్ సంకల్పాన్ని నాగబాబు సమర్థవంతంగా అమలు చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రకృతిపై అపారమైన ప్రేమ ఉన్న నాగబాబు, పర్యావరణ పరిరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మలిచే బాధ్యతల్లో సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షించారు. కేబినెట్ హోదా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మద్దతు తెలిపిన కూటమి పక్షాల నాయకులకు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
పోటెత్తిన అభినందనలు.. ఘనంగా సత్కారం
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాగబాబును పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అభినందించిన వారిలో పీసీసీఎఫ్ పీవీ.చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ చీఫ్ రాహుల్ పాండే, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఎన్. నాగేశ్వరరావు, సీసీఎఫ్ గుంటూరు వై. శ్రీనివాసరెడ్డి, పీసీసీఎఫ్ విజిలెన్స్ రేవతి, ఏపీ గ్రీన్ సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీఎన్ఎన్ మూర్తి, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, డిప్యూటీ సీఎం ఓఎస్డీ వెంకటకృష్ణ ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ పంచకర్ల సందీప్ తదితరులు నాగబాబును కలిసి అభినందనలు తెలిపారు.














Click it and Unblock the Notifications