అందుకే పవన్ కళ్యాణ్ ప్రచారం: 'ప్రత్యేక హోదా' రంగంలోకి జనసేన
కాకినాడ: ప్రత్యేక హోదా విషయమై జనసేన పార్టీ రంగంలోకి దిగింది. ఏపీకి హామీ ఇచ్చిన మేరకు భారతీయ జనతా పార్టీ హోదాను ఇవ్వాల్సిందేనని జనసేన పేరుతో నిరసనలు తెలుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం హోదా విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి చురకలు అంటించారు.
తాజాగా, జనసేన ప్రత్యేక హోదా ఇవ్వాలని నిరసన తెలిపింది. ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన తెలిపింది. ఆ పార్టీ కార్యకర్తలు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జల దీక్ష పేరిట వినూత్న నిరసనకు దిగారు. ప్లకార్లు చేతబట్టిన ఆ పార్టీ కార్యకర్తలు సముద్రంలోకి దిగి మోకాళ్ల లోతు నీటిలో నిలబడి హోదా కోసం జలదీక్ష చేపట్టారు.

ప్రత్యేక హోదా కావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్రంలోని అధికార బీజేపీపై ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యతను బీజేపీ విస్మరిస్తోందన్నారు.
ఏపీకి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే గత ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమికి అనుకూలంగా తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీల జెండాలు పక్కనబెట్టి హోదా కోసం పోరాడాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వాసులు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఎంపీలు పోరాడాలన్నారు.












Click it and Unblock the Notifications