ఆ తేదీల్లో శివమొగ్గకు క్షుద్రపూజల కోసమే వెళ్ళిన హరీష్ రావు.. కాదని నిరూపించు!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వర్షాలను అడ్డుకునేందుకు హరీష్ రావు ఆలయాలలో క్షుద్ర పూజలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన వారికి లీగల్ నోటీసులు పంపించిన హరీష్ రావు తీరును మహేష్ కుమార్ గౌడ్ తప్పు పట్టారు.
హరీష్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ సంచలనం
హైదరాబాద్లోని గాంధీభవన్ లో ఈ మేరకు మాట్లాడిన ఆయన హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని, ఇందులో ఎటువంటి దాపరికం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, ప్రజలు కరువుతో అల్లాడి పోవాలని హరీష్ రావు కుతంత్రాలు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కుట్రలో భాగంగానే వాస్తవాలు మాట్లాడిన వారికి నోటీసులు పంపించారన్నారు.

ఆ తేదీల్లో హరీష్ రావు ఎక్కడ ఉన్నారో సమాధానం చెప్పాలని సవాల్
హరీష్ రావు స్వార్థం పరాకాష్టకు చేరుకుందని విమర్శలు గుప్పించారు. క్షుద్ర పూజలు చేశారని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తమిళనాడులోని తిరుచ్చి, శివమొగ్గలో క్షుద్ర పూజలు చేసే దేవాలయాలు ఉన్నాయని, మే 31, జూన్ 1, జూలై 23 తేదీల్లో హరీష్ రావు శివమొగ్గ వెళ్లినట్లు సమాచారం ఉందని తెలిపారు. ఆ తేదీల్లో హరీష్ రావు ఎక్కడ ఉన్నారో మీడియాకు సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ సవాలు విసిరారు.
శివమొగ్గ ఎందుకు వెళ్ళారో హరీష్ సమాధానం చెప్తే మేం సమాధానం చెప్తాం
హరీష్ సమాధానం చెబితే తాను, ముఖ్యమంత్రి కూడా సమాధానం చెబుతామని అన్నారు. శివమొగ్గ వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేయలేదు? చెప్పాలని ప్రశ్నించారు. తిరుపతి మాదిరిగా అక్కడ మీడియా అడ్రస్ ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రం నాశనం అయిపోవాలని క్షుద్ర పూజలు ఎంతవరకు సమంజసమని అడిగారు. ఇంతకుముందు కేటీఆర్‌కు కూడా ఈ విషయం సభాముఖంగా చెప్పానని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే అఘోర, తాంత్రిక పూజలు
బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే అఘోర, తాంత్రిక పూజలు చేయడం వారికి అలవాటుగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో క్షుద్ర పూజల ప్రచారం నమ్మడం కష్టమైనా, హరీష్ రావు వైఖరి చూస్తే అనుమానాలు వస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పెట్రోల్ పోసుకున్నా అగ్గిపెట్ట దొరకని స్థితిలో హరీష్ ఉన్నారని, గతాన్ని గుర్తు చేసి ఎద్దేవా చేశారు. అరుంధతి సినిమాలోని పశుపతి లా హరీష్ రావు ప్రవర్తిస్తున్నారు అన్నారు.













Click it and Unblock the Notifications