కవాతుకు సిద్ధమౌతున్న జనసేన, నేను వస్తానని ఊహించలేదు: పవన్ కళ్యాణ్
Recommended Video

ఏలూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 15వ తేదీన ఆయన విజ్జేశవరం మీదుగా పిచ్చుకలంకకు కారులో చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు కార్యకర్తలతో కలిసి కవాతు ప్రారంభిస్తారు.
ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా ఈ కవాతు సాగుతుంది. కాటన్ విగ్రహం వద్ద ఇది ముగుస్తుంది. ఆ తర్వాత బహిరంగ సభలో జనసేనాని మాట్లాడుతారు. బహిరంగ సభలో పాల్గొనే నేతలు, కార్యకర్తల వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు గోదావరి జిల్లాల నుంచి వచ్చే వారి కోసం 10 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వస్తానని ఊహించలేదు
కాగా, సోమవారం పవన్ కళ్యాణ్ కొయ్యలగూడెం బహిరంగ సభతో పాటు ఇతర ప్రాంతాల్లో మాట్లాడారు. తాను వేల కోట్లు దోచుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. ఇప్పుడు రాజకీయాలు వేల కోట్లతో ముడిపడిన వ్యవస్థగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తాత, తండ్రి ముఖ్యమంత్రులు కారని, తనకు వేల కోట్లు లేవని, ప్రజల తరఫున నిలబడి పోరాటం చేసేందుకు వచ్చానని అన్నారు.

జీవితం ధారపోసేందుకు వచ్చా
నేను జీవితం అంతా ప్రజలకు ధారపోసేందుకు వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్లు వేయకుండా ప్రజలను చంపేసేలా ఉన్నారని విమర్శించారు. గ్రామాల నుంచి రాజధాని వరకు సామాన్య ప్రజలు రెండు గ్రూపుల మధ్య నలిగిపోతున్నారన్నారు. అధికార, ప్రతిపక్ష గ్రూపులు ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాయన్నారు.
చంద్రబాబుకు అందుకే మద్దతిచ్చా కానీ
మంచి పాలన అందిస్తారని గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చామని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ వారు తమ బాధ్యతలను విస్మరించి దోపిడీలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళలు, వృద్ధులపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుంటే తానే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, గవర్నర్‌ల దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.
చేగువేరా వర్ధంతి
ఇదిలా ఉండగా, చేగువేరా వర్ధంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు ట్వీట్లు చేశారు. చేగువేరా స్ఫూర్తితో అని పత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేసారు. ఆయనకు సంబంధించిన పలు ఫోటోలను జనసేనాని పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications