అయిననూ వెళ్లివచ్చితిని హస్తినాపురానికి!!
రాజకీయాల్లో రాణించాలంటే మొహమాటాలకు తావుండకుండా చూసుకోవాలి. ఏ పార్టీ నేత అయినా తన పార్టీకి ఏది ప్రయోజనమనుకుంటే అదే చేస్తారు. ఎదుటివారు మొహమాటపడుతున్నారనో, లేదంటే తనకు మొహమాటం ఎక్కువయ్యో ఇబ్బంది పడితే అంతిమంగా పార్టీకి నష్టం కలుగుతుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు.రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కూడా అంతే. భారతీయ జనతాపార్టీ అధిష్టానంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొహమాటానికి పోతున్నారని, దీన్ని ఆ పార్టీ నేతలు అవకాశంగా తీసుకుంటున్నారని, అందుకే తాము అలుసైపోయామని జనసైనికులు మండిపడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే పట్టుదలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. తాజాగా ఆయన నాదెండ్ల మనోహర్ తో కలిసి హస్తినాపురం పర్యటన ముగించుకున్నారు. భారతీయ జనతాపార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో అరగంట భేటీ అయ్యారు. అయితే చిత్రంగా ఏపీ రాజకీయాల్లో మున్ముందు ఎలా వ్యవహరించాలి? పొత్తు విషయంలో ఏవిధంగా ముందుకు వెళ్లాలి? అనే విషయాలు మాత్రం చర్చకు రాలేదని తెలిసింది.

ఏపీలో బీజేపీ, జనసేన కలిసి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఇంతవరకు ఒక్క కార్యక్రమాన్ని కూడా ఉమ్మడిగా చేపట్టలేదు. తిరుపతి లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల అనంతరం ఎవరిదారి వారిదే అయ్యింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు జనసేన పరోక్షంగా సంకేతాలిచ్చింది. బీజేపీని కూడా కలుపుకొని వెళ్లాలనేది టీడీపీ, జనసేన భావనగా ఉంది. అయితే ఎన్నికలకు చివరి ఆరునెలల్లో మాత్రమే పొత్తుల గురించి చర్చిద్దామని, అప్పటివరకు వద్దని బీజేపీ అగ్రనాయకత్వం ఖరాఖండిగా చెప్పేసింది.
ఏపీ బీజేపీ నాయకత్వంతో తనకు గ్యాప్ ఉందని, వైసీపీపై పోరాటానికి వారు కలిసిరావడంలేదనే అసంతృప్తిని పవన్ వ్యక్తపరుస్తున్నారు. అడిగినప్పుడు మద్దతు ప్రకటించలేని కమలదళం చెబుతోంది. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటన వారు కోరుకున్న ప్రయోజనాలను ఇచ్చిందా? టీడీపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందా? టీడీపీతో కలిసి జనసేన వెళుతుందా? ఈ రెండు పార్టీలతో కలిసి బీజేపీ కూటమి ఏర్పాటు చేస్తుందా? అనే అంశాలపై స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు












Click it and Unblock the Notifications