పవన్ కల్యాణ్ కీలక ప్రకటన - వేర్వేరుగానేనా, ఏం జరుగుతోంది..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కర మలుపులు తిరుగుతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా పని చేస్తన్నారు. టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. బీజేపీ తోనూ పొత్తు ఉంటుందని చెబుతున్నా, ఆ పార్టీ నుంచి స్పష్టత లేదు. మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇదే సమయంలో వరుసగా పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనలు రాజకీయంగా టీడీపీలో డైలమాకు కారణమవుతున్నాయి.
పవన్ తాజా వ్యూహాలతో: వారాహి యాత్ర ప్రారంభం వరకు పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుపైన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. యాత్ర ప్రారంభం నుంచి తానే సీఎం, జనసేనకు అధికారం ఇవ్వండి అంటూ నినాదం ప్రారంభించారు. తాజాగా ఢిల్లీలో ఎన్టీఏ సమావేశానికి హాజరయ్యారు. ప్రత్యేకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ భేటీ అయ్యారు.

ఆ తరువాత పార్టీ సమావేశంలోనూ తాను కోరుకున్న విధంగానే పొత్తులు ఉంటాయనే సంకేతాలు పవన్ ఇచ్చారు. ఇదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నుంచి పవన్ తో కలిసి పని చేస్తామంటూ ప్రతిపాదన వచ్చింది. త్వరలోనే ఇద్దరూ కలిసి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించారు.
అభ్యర్ధుల ప్రకటన మొదలు: ఇక, పార్టీ అభ్యర్ధుల విషయంలో పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ను తెనాలి అభ్యర్ధిగా ప్రకటించారు. అక్కడ టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేసారు. దీని పైన రాజకీయంగా చర్చ సాగింది.
సీట్ల విషయంలో తాను ఇప్పటి వరకు ఎవరితోనూ చర్చలు చేయలేదని చెప్పిన పవన్..పొత్తులు ఖాయమని భావిస్తున్న వేళ ఈ విధంగా సీట్లు ప్రకటించటం ద్వారా పట్టు బిగించే వ్యూహం అమలు చేస్తున్నారా... తాను కోరుకున్న విధంగా సీట్లు ఇవ్వకపోతే ప్రత్యామ్నాయ మార్గాన్ని ముందుగానే సిద్దం చేసుకుంటున్నారా అనే ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయాన్ని పవన్ ప్రకటించారు.

మేనిఫెస్టో పైనా కొత్త చర్చ: కలిసి వస్తే బీజేపీ తో పాటుగా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి. బీజేపీ ముందుకు రాకపోతే పవన్ టీడీపీతోనే ఉంటారని, దసరా నాడు మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని ఇప్పటి వరకు పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ, పవన్ ఇప్పుడు జనసేన మేనిఫెస్టో అంటూ నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తే సర్పంచ్‌ల చెక్ పవర్‌ను వారికే అప్పగిస్తామని హామీ ఇచ్చారు. దీనిని జనసేన మేనిఫెస్టోలో పెడతామని పవన్ వెల్లడించారు.
జనసేన అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులు ఇవ్వడంతో పాటు సర్పంచ్‌లందరికి జీవిత భీమా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు. దీని ద్వారా పొత్తు ఉంటుందని భావిస్తున్న సమయంలో పవన్ నిర్ణయాలు టీడీపీ శ్రేణులకు అంతు చిక్కటం లేదు. పొత్తు ఉంటే ఉమ్మడి అజెండా..మేనిఫెస్టో కాకుండా వేర్వేరుగా ప్రకటిస్తారా అనే సందేహాలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications