సీనియర్ NTR 'బాట'లో పవన్ కల్యాణ్!
జనసేనలో మేధోమథనం జరుగుతోంది. తరుచుగా పార్టీ నాయకులతో అధినేత పవన్ కల్యాణ్ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లోగా జనసేనను బలోపేతం చేయడంతోపాటు బలమైన నాయకత్వం ఉన్న పార్టీగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అందుకు పార్టీలోని సీనియర్ నేతలతోపాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీతోను చర్చిస్తున్నారు.

ఇన్ ఛార్జిల నియమకానికి పవన్ సన్నాహాలు
జనసేనకు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలున్నప్పటికీ నాయకత్వలేమి వెంటాడుతోంది. 175 నియోజకవర్గాలకు గాను ఇప్పటివరకు ఆ పార్టీకి కేవలం 40 నుంచి 50 నియోజకవర్గాలకు మాత్రమే ఇన్ ఛార్జిలున్నారు. ఇటీవలే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రెండుసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించిన పవన్ ఇన్ ఛార్జిలను నియమించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అనుసరించిన విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు.

1983లో టీడీపీని వెంటాడిన నాయకత్వ లేమి
తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పుడు ఆ పార్టీకి ఇలాగే నాయకత్వలేమి వెంటాడింది. 1983 ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీచేయడానికి అందరినీ యువకులను, చదువుకున్నవారిని, ప్రొఫెషనల్స్ ను ఎంపిక చేశారు. ఆ సమయంలో సీనియర్ నాయకులు, హేమాహేమీలంతా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో ఉండేవారు. రాజకీయ యవనికపై కొత్త ముఖాలను చూసిన ప్రజలకు కొత్త రాజకీయం నచ్చడంతో టీడీపీ అభ్యర్థులను గెలిపించారు. ఆ తర్వాత రాజకీయాల్లో కొత్తవారిని రాజకీయ పార్టీలు పరిమిత సంఖ్యలోనే ప్రోత్సహిస్తున్నాయి. ఇన్ని దశాబ్దాల్లో ఎవరూ పూర్తిస్థాయిలో కొత్త రక్తాన్ని ప్రోత్సహించలేదు.

ఎన్టీఆర్ చూపిన మార్గంలో..
జనసేనకు కూడా కొత్తగా ఇన్ఛార్జిలు కావాల్సి ఉండటంతో ఎన్టీఆర్ చేసిన ప్రయోగం చేయాలని పవన్ నిర్ణయించారు. నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు కూడా పవన్ కల్యాణ్ పర్యటించినప్పుడే హడావిడి చేయడం మినహా సొంతంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడంలేదు. పార్టీ కోసం పనిచేయనివారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పనిచేయనివారు తనకు అవసరంలేదని, జనసేన జెండాను పట్టి రోడ్లమీదకు వెళితే పార్టీ మనుగడ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. పార్టీని రాష్ట్రవ్యాప్తంగా పరుగులు పెట్టించాలంటే ముందుగా ఇన్ ఛార్జిలను నియమించాలని పవన్ నిర్ణయించారు. కొత్త నెత్తురును ప్రవేశపెట్టడంద్వారా వారు రాజకీయాల్లో నిలదొక్కుకోవడమే కాకుండా పార్టీని కూడా నిలబెడతారని జనసేనాని భావిస్తున్నారు. అందుకనుగుణంగా తన తదుపరి కార్యాచరణ ఉండేట్లుగా ప్రణాళికలు రచించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications