ప్రధాని మోడీ పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇవ్వరా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం హస్తినాపురంలో ఉన్నారు. కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, మురళీధరన్ తో సమావేశమయ్యారు. మురళీధరన్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. పవన్ తోపాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతోనే పవన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడి తెలుగువారిని ఆకట్టుకోవడానికి పవన్ ను కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేయించే ఉద్దేశంతోనే పిలిపించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

బీజేపీకి చెందిన ముఖ్యనేతలందరినీ కలిసిన తర్వాత ఎందుకు ఢిల్లీ వచ్చిందనే విషయాన్ని తానే చెబుతానని పవన్ తెలిపారు. మురళీధరన్ తో రెండుసార్లు సమావేశమైన పవన్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఏపీలో బీజేపీ-జనసేన మధ్య అధికారికంగా పొత్తున్నప్పటికీ ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడంలేదు. తెలుగుదేశం పార్టీకి చేరువవుతున్న జనసేనాని బీజేపీ కూడా పొత్తుకు కలిసిరావాలని కోరుతున్నారు.

ఢిల్లీ వెళ్లిన పవన్ ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలవలేదు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు అమిత్ షాను ఈరోజు సాయంత్రం లేదంటే రాత్రికి కలిసే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల్లో పవన్ అవసరం ఉందని గుర్తించిన బీజేపీ నేతలు ఇప్పుడు ఢిల్లీ పిలిపించి దగ్గరకు తీస్తున్నారని, గతంలో ఎన్నోసార్లు ప్రధానమంత్రిని, హోం మంత్రిని కలవడానికి ప్రయత్నిస్తే కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని జనసేన శ్రేణులు నిష్టూరమాడుతున్నారు. బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే జనసేన ఎప్పుడో బలపడేదని, దీనివల్ల తమ పార్టీయే నష్టపోయిందని జనసైనికులు చెబుతున్నారు. మిత్రపక్షంగా తమకు ఏనాడూ ఏపీ బీజేపీ నేతలు గౌరవం ఇవ్వలేదని, కనీసం ఢిల్లీ నేతలైనా గౌరవమిస్తే రెండు పార్టీల శ్రేణులకు సమంజసంగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications