హోం క్వారంటైన్‌లో పవన్ కల్యాణ్ -జనసేనాని సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ -వకీల్ సాబ్ వేడుకలో వైరస్ వ్యాప్తి
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తున్నది. తెలంగాణ, ఏపీల్లో కొత్త కేసులు మూడు వేల మార్కును దాటేశాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వైరస్ అందరినీ మడతపెట్టేస్తున్నది. సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతోన్నా, సినిమాలకు జనం పోటెత్తుతుండటం, సినిమా వేడుకలు వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారుతుండటం కలకలం రేపుతున్నది. ఈ క్రమంలో టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బంది కరోనా కాటుకు గురికావడంతో..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు జనసేనాని హోం ఐసోలేషన్‌కే పరిమితం అయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ హీరోగా వచ్చిన 'వకీల్ సాబ్' సినిమా వేడుకలో పాల్గొన్న చాలా మందికి వైరస్ సోకడం తెలిసిందే.

''జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముఖ్య కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువమంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. గత వారం రోజులుగా ఆయన పరివారంలోని ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు'' అని జనసేన ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు
వ్యక్తిగత సిబ్బంది, అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తులంతా కొవిడ్ -19 పాజిటివ్ గా తేలడంతో జనసేనాని పవన్ కూడా ఐసోలేషన్ లోకి వెళ్లారు. అయితే, ఆయన రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారని పార్టీ చెప్పడం గమనార్హం. టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో పవన్ నిరంతరం మాట్లాడుతున్నారని ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications