ఢిల్లీ పర్యటనలో పొత్తులపై పవన్ క్లారిటీ - బీజేపీ తేల్చిందేంటి..!!
ఢిల్లీ పర్యటనలో బీజేపీ ముఖ్య నేతలతో జరిగిన చర్చల గురించి జనసేన నేత నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ..బీజేపీతో కొనసాగే అంశం పైన ఢిల్లీ నేతలతో చర్చలు జరిగాయి. అదే సమయంలో టీడీపీతో పొత్తు పైన చర్చకు వచ్చిందని మనోహర్ స్ఫష్టం చేసారు.
ప్రతిపక్షాల ఓట్లు చీలనీయకూడదనే లక్ష్యంగా 2014 తరహా ఫార్ములాకు పవన్ మరోసారి ఢిల్లీ వేదికగా బీజేపీ కేంద్ర నేతల ముందు ప్రతిపాదించారు. దీని పైన బీజేపీ నేతల స్పందన కీలకం కానుంది. కమలం పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పవన్ తన కార్యచరణ ప్రకటనకు సిద్దం అవుతున్నారు.

టీడీపీతో పొత్తుపై చర్చ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన లక్ష్యం స్పష్టమైంది. ఢిల్లీలో బీజేపీ నేతలతో జరిగిన చర్చల గురించి జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కీలక అంశాలను వెలలడించారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కల్యాణ్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఢిల్లీ పర్యటనలో అనేకమంది జాతీయ స్థాయి నాయకులతో చర్చలు జరిపామన్నారు.
ఆ చర్చల్లో భాగంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాంటి రాజకీయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, ప్రజలకు మెరుగైన పాలన అందించేలా ఎలా ముందుకు వెళ్లాలనే అంశం ప్రాతిపదికన చర్చలు జరిగినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తు పైన చర్చ జరిగిందని.. రాజకీయాలు అన్నాక అన్నీ చర్చకు వస్తాయని మనోహర్ వ్యాఖ్యానించారు.
2014 తరహా పొత్తుల దిశగా: ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానంగా పవన్ బీజేపీ నేతలతో ఏం చర్చించారనేది స్పష్టత వస్తోంది. తాను బీజేపీ మిత్రపక్షంగానే కొనసాగుతూ..తమతో టీడీపీని కలుపుకుపోవాలనే ప్రతిపాదన చేసినట్లు ఇప్పుడు మరింత స్పష్టత వస్తోంది. దీని ద్వారా 2014 ఎన్నికల తరహాలో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీ చేయాలని బీజేపీ ముఖ్య నేతల ముందు పవన్ ప్రతిపాదించినట్లు సమాచారం.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయ కుండా ఉండాలంటే ఈ మూడు పార్టీలు కలవాల్సిన అవసరం పవన్ వివరించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా, వైసీపీ విముక్త ఏపీ వైపు అంతా అడుగులు వేస్తారన్న నమ్మకం తమకు కలిగిందని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.
బీజేపీ నిర్ణయం తరువాతనే పవన్ క్లారిటీ:తాము చేసిన ప్రతిపాదన పైన బీజేపీ నాయకత్వం సానుకూలంగా స్పందిస్తుందని జనసేన భావిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ఎదగాలనే లక్ష్యంతో ఉందని ఆ పార్టీ నేతలు పవన్ కు తేల్చి చెప్పారు. టీడీపీతో కలిసే అంశం పైన స్పష్టత ఇవ్వలేదు. దీని పైన పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పినట్లుగా సమాచారం.
అదే సమయంలో జనసేన రాష్ట్రంలో సంస్థాగతం గా బలోపేతం దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. బీజేపీ నాయకత్వం తిరిగి టీడీపీతో పొత్తుకు ముందుకు వస్తే మూడు పార్టీలు, లేకుంటే టీడీపీతో కలిసి అడుగులు వేసే విధంగా పవన్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. దీంతో..ఇప్పుడు బీజేపీ నేతల నిర్ణయం కీలకం కానుంది.












Click it and Unblock the Notifications