Pawan Kalyan: చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ పై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే..
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం, ఏసీబీ కోర్టు ద్వారా రిమాండ్ విధింపుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అలాగే నిన్న రాత్రి ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో తనను అడ్డుకోవడంపైనా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుకు నా మద్దతు ఇప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, నేను మాట మార్చనన్నారు.
వైజాగ్ లో అంత గొడవ జరిగినప్పుడు చంద్రబాబు నోవాటెల్ కు వచ్చి నాకు మద్దతిచ్చినప్పుడు స్పందించడం సంస్కారం అన్నారు. అందులో భాగంగా చంద్రబాబుకు మద్దతిస్తానన్నారు.
తాను నిన్న సీఐడీ కోర్టుకు వెళ్తానని ఊహించుకుని పోలీసులు శాంతి భద్రతల సమస్యగా చూపించారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వారాహి యాత్రకు వెళితే అమలాపురంలో రెండు వేల మంది కిరాయి సైన్యాన్ని దింపారని, వారాహి యాత్రలో కలిసిపోయి 50 మందిని చంపేయండని వారికి చెప్పి పంపారన్నారు. ఇది కేంద్రం నుంచి తనకు వచ్చిన ఇన్ పుట్ అన్నారు.
ఇవన్నీ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ఎవరికీ నోరు ఉండొద్దు, ప్రశ్నించొద్దనేలా ఉన్నాయన్నారు.

మీరు నేరాలు చేసి జైళ్లకు వెళ్తే మేం ఎందుకు భయపడతామని వైసీపీ సర్కార్ ను పవన్ ప్రశ్నించారు. మీరు చేసే పనులు జనసేన, టీడీపీ వంటి ప్రతిపక్షాలకు బలమిస్తున్నాయన్నారు. ఎవరూ భయపడరన్న విషయం వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. బెయిల్ పై వచ్చినోడు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు. చట్టాలే సంపూర్ణంగా పనిచేస్తే జగన్ సీఎంయే కాడు, కాలేడన్నారు. పోలీసులు కూడా నలిగిపోతున్నారని పవన్ తెలిపారు.
ఇది చాలా క్లిష్టమైన సమయమని, జీ20 సదస్సు జరుగుతున్న సమయంలో చంద్రబాబును అరెస్టు చేశారని పవన్ విమర్శించారు. కీలక సమయంలో విపక్ష నేతల్ని అరెస్టులు చేసి, అడ్డుకోవడం జీ20ని డైవర్ట్ చేయడానికే అన్నారు. సమాఖ్య వ్యవస్ధలో కేంద్రం కూడా ఇలాంటి చర్యల్ని అడ్డుకోలేదన్నారు. కేంద్రం వైసీపీకి అండగా నిలబడిందన్నారు. ఇన్ని కోట్ల మందికి జీ20పై ఉన్న ఆసక్తిని వైసీపీ ప్రభుత్వం చంపేసిందన్నారు. కేంద్రం దృష్టికి ఈ అంశాల్ని తీసుకెళ్తానని పవన్ తెలిపారు.
ఏ మార్పు అయినా యుద్ధం లేకుండా జరగదని పవన్ తెలిపారు. కారులో ఉండొద్దని, హోటల్లో రాకూడదని, ఫ్లైట్ ఎక్కకూడదంటే రోడ్డు మీద పడుకున్నా అన్నారు. నా లాంటి వాడికే ఇలా జరిగితే, చంద్రబాబు లాంటి వాళ్లనే ఇలా చేస్తే రాష్ట్రంలో సగటు మనిషి బతకగలడా అని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రమాదకర పరిణామాలే అన్నారు. ఇది ఏపీ ప్రజలకు అవసరమే, పోరాడి తెచ్చుకోవాల్సిందేనని తెలుస్తుందన్నారు. ఇవన్నీ రాష్ట్రానికి చీకటి రోజులే అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని పవన్ తెలిపారు. వైసీపీ వాళ్లు యుద్దం కోరుకుంటున్నారు, మేం కూడా అదే ఇస్తాం, ఎక్కడికీ పారిపోబోమన్నారన్నారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే తాము ప్రయత్నిస్తున్నామని, జగన్ సైకో, నువ్వు జైలుకెళ్తే అందరినీ జైలుకు పంపించాలంటే ఎలా అని పవన్ అడిగారు. వరంగల్లో జగన్ ను రాళ్లతో తరిమికొట్టలేదా అని ప్రశ్నించారు. ఏపీలోనూ భవిష్యత్తులో ఇదే జరుగుతుందన్నారు. పులివెందుల లాంటి చిన్న ప్రాంతంలో జగన్ ఫ్యాక్షనిజం చెల్లుతుంది కానీ ఎక్కడా చెల్లదన్నారు. విజయవాడ వస్తానంటే శాంతి భద్రతల సమస్య వస్తుందని కృష్ణాజిల్లా ఎస్పీ అడ్డుకున్నారని, 10 లక్షల మంది వచ్చిన రోజే నేను రెచ్చగొట్టేలా మాట్లాడానా అని అడిగారు. నాకు ఎక్కడికైనా వెళ్లే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు.
నన్ను అడ్డుకోవాలంటే నేను ఉగ్రవాదినో, పాకిస్తాన్ తీవ్రవాదినో అయ్యుండాలన్నారు. నిన్న పోలీసులకు కూడా నన్ను వెళ్లనివ్వండని అడిగానన్నారు. అరెస్టుకు సహకరించమని పోలీసులు నన్ను అడిగారని, పార్టీ ఆఫీసుకు రావడానికి నేను ఎవరి పర్మిషన్ తీసుకోవాలన్నారు. మంగళగిరికి షిఫ్ట్ అయ్యాను కాబట్టి రాకపోకలు రెగ్యులర్ గా ఉంటాయని, నేనేమైనా ఆర్ధిక నేరాలు చేశానా అని అడిగారు. మీరు దేశం వదిలి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి, నేను మీ పర్మిషన్ తీసుకోవాలా అన్నారు.
దారిపొడవునా జనసేన కార్యకర్తలు, మహిళలు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి, వేల కోట్లు కలిగిన వ్యక్తి మనల్ని పాలిస్తున్నారని పవన్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications