పవన్ నెక్స్ట్ టార్గెట్ రెడీ-జనసేన ప్రకటన-ఎల్లుండి నుంచి సోషల్ వార్..!
ఏపీలో జగనన్న కాలనీల ముసుగులో వైసీపీ ప్రభుత్వం చేసిన అతి పెద్ద కుంభకోణాన్ని మరోసారి సోషల్ మీడియా క్యాంపెయిన్ రూపంలో జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు జనసేన పార్టీ ఇవాళ ప్రకటించింది. వర్షాకాలంలో జగనన్న కాలనీల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టే విధంగా రాష్ట్రవ్యాప్త ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఎల్లుండి శనివారం ఉదయం 10 గంటల నుంచి జనసేన నేతలు, వీర మహిళలంతా తమ ప్రాంతాల్లోని జగనన్న కాలనీలు సందర్శించి అక్కడ పరిస్థితులను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయబోతున్నారు.
ఈ మేరకు ఇవాళ పార్టీ నేతలతో సమావేశమైన జనసేన పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ జగనన్న కాలనీల పేరిట జరిగిన అతిపెద్ద కుంభకోణాన్ని విజయనగరం జిల్లా గుంకలాం ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ బయటపెట్టగా, అద్భుతమైన డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకు గతేడాది తెలియచెప్పే ప్రయత్నం చేశామన్నారు.

నిరుపయోగంగా ఉన్న భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి వైసీపీ నాయకులు, శాసనసభ్యులు ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేసుకున్నారని మనోహర్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో చెరువుల్ని సైతం ఆక్రమించేసి ప్రభుత్వానికి ఇళ్ల స్థలాలకు అమ్మి సొమ్ము చేసుకున్నారన్నారు. మౌలిక వసతుల కల్పన పేరిట రూ. 89 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, ఆ కోట్లు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు. ప్రతి జగనన్న కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తామని రకరకాల కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూనే ఉందన్నారు.
మౌలిక వసతుల పేరిట చేసిన మోసాన్ని ప్రజలకు తెలియచేద్దామని జనసేన నేతలకు మనోహర్ పిలుపునిచ్చారు. రోడ్ల నిర్మాణం కూడా స్థానిక ఎమ్మెల్యేల అనుచరులకే పరిమితం అయ్యిందని, కొన్ని ప్రాంతాల్లో లబ్దిదారుల నుంచి రోడ్ల నిర్మాణం పేరిట డబ్బులు వసూలు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలు నిరసన తెలిపితే పట్టాలు రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడి మరీ బలవంతంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు.
కాబట్టి అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శనివారం పార్టీ శ్రేణులంతా కలసి జగనన్న కాలనీలు సందర్శించి అక్కడ వాస్తవ పరిస్థితులు ఫోటోల రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియచేయాలని మనోహర్ సూచించారు. ఒక వానకే పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు మునిగిపోయాయని, వైసీపీ చేసిన అతిపెద్ద స్కామ్ ని ప్రజల్లోకి తీసుకువెళ్దామన్నారు. జగనన్న కాలనీల పేరిట ఇచ్చిన పట్టాల ప్రహసనం ఒక ఎత్తయితే.. తరవాత ప్రజల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారన్న విషయాన్ని లబ్ధిదారులు చాలా సందర్భాల్లో పార్టీ దృష్టికి తీసుకు వచ్చారని, పార్టీ నాయకులతోపాటు జనసైనికులు, వీర మహిళలు జగనన్న కాలనీల్లో పర్యటించి ప్రజలకు వాస్తవాలు తెలుపుదామన్నారు.












Click it and Unblock the Notifications