ఏపీ రోడ్ల మరమ్మత్తుల కోసం జనసేన పోరాటం .. శ్రమ దానాలు, వీడియోల ప్రదర్శనలతో ప్రజల్లోకి పవన్ పార్టీ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటంలో గత కొంతకాలంగా వెనకబడిన జనసేన పార్టీ మళ్లీ ప్రజాసమస్యలపై పోరాటం చేయడానికి రంగంలోకి దిగుతుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరకాన్ని తలపిస్తున్న రోడ్ల మరమ్మతుల కోసం జనసేన పోరాటానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రహదారుల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది జనసేన పార్టీ. ఇక ఈ విషయాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ప్రభుత్వం రోడ్లు మరమ్మత్తు చేసే దిశగా ఒత్తిడి తెచ్చే ప్లాన్ లో జనసేన
రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పడిపోయి, పాడైపోయిన రహదారులపై పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, రోడ్ల మరమ్మత్తులపై ప్రభుత్వం దృష్టి పెట్టకుంటే గాంధీ జయంతి సందర్భంగా శ్రమదానం నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల శ్రమదానంలో పాల్గొంటారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇక సామాజిక మాధ్యమాల ద్వారా కూడా జనసేన పార్టీ అధికార వైసీపీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అధ్వాన్నంగా మారిన రోడ్ల వీడియోలు తీసి పెద్దఎత్తున ప్రదర్శన
రాష్ట్రంలో అధ్వానంగా మారిన రోడ్ల దుస్థితిపై వీడియోలు తీసి వాటిని ప్రదర్శించి ఉద్యమించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జనసేన రాష్ట్ర ముఖ్య నేతలతో దయనీయంగా మారిన రోడ్ల పరిస్థితిని బాగు చేయడం కోసం ఉద్యమం చేపడుతున్నట్లు వెల్లడించిన మనోహర్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ల కోసం జనసేన పార్టీ అనే నినాదంతో రోడ్ల పరిశీలన పోస్టర్ ను ఆవిష్కరించిన జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో ఎప్పుడూ రోడ్ల విషయంలో ఇలాంటి దుస్థితిని చూడలేదని వెల్లడించారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా వైసిపి ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నట్లు మండిపడ్డారు.
రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై నిప్పులు చెరిగిన జనసేనాని
1,26,000 కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, నిత్య నరకం చూస్తున్నా ప్రభుత్వ వైఖరిలో చలనం లేదని నిప్పులు చెరిగారు. 12,450 కోట్ల రూపాయలు రహదారులు బాగుకోసం కేటాయించామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడా రహదారులను బాగు చేశారో చూపించాలని ప్రశ్నించారు. కేవలం అక్రమాలకు పాల్పడటం కోసమే రహదారుల మరమ్మతులు చేస్తున్నామని చెబుతున్నారని, కానీ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఎక్కడ రహదారుల మరమ్మతులు జరిగినట్లు కనిపించడం లేదని వెల్లడించారు.
Recommended Video
సెప్టెంబర్ 2,3,4 తేదీలలో రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమాలు.. ఆపై గాంధీ జయంతి రోజు శ్రమదానం
సెప్టెంబర్ 2,3,4 తేదీలలో రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేసిన నాదెండ్ల మనోహర్ రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితిపై వీడియోలు తీసి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలని భావిస్తున్నామని, ఈ మేరకు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఇక ప్రభుత్వ స్పందన కోసం నెల రోజుల పాటు వేచి చూస్తామని ప్రభుత్వం బాగు చేస్తే సరి, లేదంటే జనసేన అధ్యక్షుడు నుండి జనసేన సైనికుల వరకు ప్రతి ఒక్కరూ రోడ్లను శ్రమదానం చేసి బాగు చేస్తారని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రతీ నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ అన్న పేరుతో హాష్ ట్యాగ్ పెట్టి పోస్ట్ చేయాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications