జనసేనలో సీట్ల లొల్లి- వైసీపీలో చేరిన పవన్ వీరాభిమాని
Janasena: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం జిల్లా భీమిలీలో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంఖారావాన్ని పూరించారు. రణభేరిని మోగించారు.
అటు అభ్యర్థుల ఎంపికలోనూ నాలుగడుగులు ముందే ఉంది వైఎస్ఆర్సీపీ. ఇప్పటికే నాలుగు విడతల్లో 68 లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయిదో విడత అభ్యర్థుల జాబితాపై కసరత్తును పూర్తి చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఈ జాబితా వెలువడొచ్చు.

తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. దీనికి సన్నాహకమా అన్నట్లు రా.. కదలిరా సభా వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ వస్తోన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
ఈ రెండు పార్టీల మధ్య సీట్ల లొల్లి నడుస్తోంది. పొత్తు ఉన్నప్పటికీ జనసేనను సంప్రదించకుండానే మండపేట, అరకు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దీనికి ప్రతిగా టీడీపీని అడగకుండానే రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు క్యాండిడేట్లను ప్రకటించారు పవన్ కల్యాణ్.
ఈ వివాదానికి తెర పడట్లేదు. పలు నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన నేతల మధ్య సమన్వయం కుదరట్లేదు. రెండు పార్టీల ఆశావహుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. పొత్తులో భాగంగా ఏ నియోజకవర్గం ఏ పార్టీకి వెళ్తుందో తెలియని అయోమయ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య- జనసేనను వీడుతున్న నాయకులూ లేకపోలేదు.
తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నాయకుడు, కమేడియన్ గల్లీ బాయ్ రియాజ్.. పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సాయంత్రం ఆయన నెల్లూరులో వైసీపీ సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిశారు. ఆయన సమక్షంలో పార్టీ కండువాను కప్పుకొన్నారు. వైసీపీ గెలవడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.
పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిగా పేరుంది రియాజ్‌కు. గతంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. 30వ వార్డు జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్‌పై ప్రత్యర్థి పార్టీ నాయకులు చేసే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వార్తల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications