ప్రధానమంత్రి భీమవరం సభలో అందరూ అద్భుతంగా నటించారు: నాగబాబు
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగులు భారీ కాంస్య విగ్రహావిష్కరణ భీమవరంలో జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ట్వీట్ చేశారు. ''మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది. స్వాతంత్య్ర
సమరయోధుడైన ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తున్నాను. ఆ సభలో మా అన్నయ్య చిరంజీవి మినహా అందరూ అద్భుతంగా నటించారు. ఆ మహానటులందరికీ నా అభినందనలు '' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కొద్దిరోజులుగా ఏపీ ప్రభుత్వ తీరుపై నాగబాబు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
కాళ్ల మండలం పెద అమిరం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతోపాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి రోజాతోపాటు సినీనటుడు చిరంజీవి పాల్గొన్నారు.

తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. అన్నయ్య మినహా అందరూ అద్భుతంగా నటించారు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గవర్నర్ ను మినహాయించినా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, కిషన్‌రెడ్డి, రోజాను అందరినీ దృష్టిలో ఉంచుకొనే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సభకు తెలుగుదేశం, జనసేన పార్టీలతోపాటు ఇతర ముఖ్య నేతలందరికీ ఆహ్వానం అందింది.
తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడి పేరు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అందిన జాబితాలో ఉన్నప్పటికీ కలెక్టర్‌కు అందిన జాబితాలో లేదంటూ హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలకడానికి ప్రభుత్వం ఆయన్ను నిరాకరించింది. పిలిచి అవమానం చేయడం ఎందుకంటూ అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేయగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి క్షమాపణలు కోరారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా ప్రధానమంత్రికి స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications