గంటాకు పవన్ చెక్, సీటుపై ఆశలు గల్లంతు - చిరంజీవిపై భారం..!!
ఏపీలో పొత్తుల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. సీట్ల ఖరారు పైనే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే విశాఖ, గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కవ సీట్లు ఆశిస్తోంది. ఇప్పుడు బీజేపీ పొత్తులో భాగంగా గతంలో గెలిచిన సీట్లను తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. దీంతో, మాజీ మంత్రి గంటా సీటు పైన సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో, ఇప్పుడు గంటా మెగాస్టార్ ద్వారా సీటు ఖాయం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
పొత్తుల లెక్కలు : ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు ఒక నియోజకవర్గం నుంచి గెలిస్తే మరోసారి అక్కడ నుంచి పోటీ చేయరు. 2019 ఎన్నికల్లో గంటా గెలిచిన విశాఖ నార్త్ ఈ సారి పొత్తులో భాగంగా బీజేపీకి ఖరారు కానుంది. అక్కడ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేయటం ఖాయమని చెబుతున్నారు. దీంతో, గంటా శ్రీనివాస రావు తన పాత నియోజకవర్గం భీమిలి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అక్కడ నుంచి ప్రస్తుతం గంటా మాజీ మిత్రుడు అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయనే అభ్యర్దిగా పోటీ చేయనున్నారు. అయితే, ఈ సీటు జనసేన తమకు కేటాయించాలని ఇప్పటికే చంద్రబాబును కోరింది.

భీమిలిపై జనసేన కన్ను : పవన్ కల్యాణ్ తమ పార్టీకి కేటాయించాలని కోరిన సీట్లలో భీమిలి ఉంది. భీమిలి లో కాపు, యాదవ ఓట్లు గెలుపును నిర్ణయిస్తాయి. ఆ రెండు సామాజిక వర్గాల వారే పోటీలో నిలుస్తారు. భీమిలి నుంచి వైసీపీ నుంచి ఎమ్మెల్సీ వంశీని కానీ బరిలోకి దించే ఆలోచనలో ఉంది. అదే సమయంలో ప్రస్తుతం టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్న కోరాడ రాజబాబు కూడా గంటాకు ఇస్తే అంగీకరించబోననీ చెబుతుంటే పార్టీ లో ఒక వర్గం రాజబాబుకు సపోర్ట్ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ప్రజారాజ్యం నుంచి అవంతి శ్రీనివాస్ విజయం సాధించారు. ఇప్పుడు తిరిగి ఆ సీటు గెలవాలనేది పవన్ టార్గెట్. 2014 లో మళ్లీ టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి దాదాపు 37 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. 2019 లో మళ్లీ అవంతి శ్రీనివాస్ వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి 9 వేల ఓట్ల మెజారిటీ సాధించారు.

గంటా పోటీ ఎక్కడ : గంటా ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యే గా ఉంటూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అంటూ రాజీనామా చేయడం, ఆమోదించడంతో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేస్తే గెలవటం ఖాయమనే ధీమాతో గంటా ఉన్నారు. కానీ, జనసేన తమకు కేటాయించాలని కోరటంతో..ఇప్పుడు గంటా ఈ సీటు కోసం కొత్త ఆలోచన చేస్తున్నారు. ప్రజారాజ్యం సమయం నుంచి మెగాస్టార్ చిరంజీవితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తరచూ కలుస్తూ ఉంటారు. ఇక, ఇప్పుడు భీమిలి సీటు కోసం చిరంజీవి ద్వారా ప్రయత్నం చేయాలనే ఆలోచనలో గంటా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరి చిరంజీవి జోక్యం చేసుకుంటారా..గంటాకు భీమిలి దక్కుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications