పవన్ కు పోటీగా మరో జనసేన పార్టీ, సింబల్ టెన్షన్ - తెర వెనుక, చీలిక..!!
ఏపీలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. కొత్త పార్టీలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ ఓటమి కోసం చంద్రబాబు, పవన్ జత కట్టారు. బీజేపీ నిర్ణయం పై స్పష్టత రావాల్సి ఉంది. మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటించారు. ముద్రగడ వైసీపీలో చేరుతారని చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీలో జాతీయ జనసేన పార్టీ ఎన్నికల్లోకి దిగుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడి పేరు పవన్ కల్యాణ్. తెలంగాణలో ఈ పార్టీ జనసేన ఓటింగ్ కు గండి కొట్టింది. ఏపీలో ఏం జరుగుతోంది.
కొత్త లెక్కలు: ఏపీలో ఎన్నికల వేళ కొత్త వ్యూహాలు..కొత్త పార్టీలు తెర మీదకు వస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ సమయంలోనే కొత్తగా జాతీయ జనసేన పేరు తో కొత్త పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన - బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసింది.

అందులో కూకట్‌పల్లి ఒకటి. ఇక్కడ జాతీయ జనసేన పార్టీ పేరుతో మరొక అభ్యర్థి కూడా పోటీ చేశారు. జనసేన గుర్తు గాజుగ్లాసు కాగా... జాతీయ జనసేన గుర్తు బకెట్. ఈవీఎంపై ముద్రించిన బ్యాలెట్‌పై ఈ రెండు గుర్తులు ఒకేలా ఉండటమే అసలు సమస్య. 'రోడ్‌రోలర్'తో తమకు నష్టం జరుగుతుందని 'కారు' గుర్తు ఉన్న బీఆర్‌ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది.
సింబల్స్ తో నష్టం: ఇప్పుడు జనసేన - జాతీయ జనసేన గుర్తులుగా ఉన్న బకెట్, గాజుగ్లాసు సింబల్స్ ఇలాంటివే. కూకట్‌పల్లిలో 'బకెట్' గుర్తుకు 800 ఓట్ల వరకూ పోలయ్యాయి. దీంతో, ఇప్పుడు ఏపీలో ఈ పార్టీ గురించి చర్చ మొదలైంది. ఏపీలో జాతీయ జనసేన పార్టీ ఏపీలో కూడా పోటీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 'బకెట్' గుర్తుతో కనీసం రెండుమూడు వేల ఓట్లు చీల్చినా తమకు లబ్ధి చేకూరుతుందని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం.
జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడి పేరు కూడా కె.పవన్ కల్యాణ్. ఈ సారి ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం ఎక్కువగా ఉండేలా టీడీపీ, జనసేన తొలి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాపు ఓటింగ్ ప్రధానంగా జనసేన - టీడీపీకి మళ్లేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా సీఎం జగన్ కొత్త సామాజిక సమీకరణాలతో ఇంఛార్జ్ ల మార్పు పైన కసరత్తు కొనసాగిస్తున్నారు.

ఎవరి వెనుక ఎవరు: ఇటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటించారు. ఎన్నికల్లో పోటీకి సిద్దమయ్యారు. కాపు ఉద్యమ నేత వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. అటు కాంగ్రెస్ సైతం ఈ సారి ఏపీలో ప్రభావం చూపించాలనే లక్ష్యంతో కసరత్తు ప్రారంభించింది. దీని ద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే పవన్ - చంద్రబాబు లక్ష్యం ఏ మేర నెరవేరుతుందనేది సందేహంగా కనిపిస్తోంది.
ఇక..కాపు ఓటింగ్ లోనూ ఈ కొత్త పార్టీల ద్వారా ఎంత మేర చీలక ..జనసేన పైన ప్రభావం చూపుతుందని కొత్త చర్చకు కారణమవుతోంది. అటు జనసేన కామన్ సింబల్ గా గాజు గ్లాసు కొనసాగింపు పైనా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో..ఎవరి వెనుక ఎవరు ఉన్నారు.. ఏ పార్టీ ఎవరి ఓటింగ్ పైన ప్రభావం చూపుతుందనేది ఎన్నికల్లో గెలుపు - ఓటమలును డిసైడ్ చేస్తుందనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications