చంద్రబాబుకు పాదాభివందనం చేసిన వైసీపీ మాజీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు పోలవరం చేరుకున్నారు చంద్రబాబు. దాదాపు నాలుగు గంటలపాటు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలవరం నిర్వాసితులతో చంద్రబాబు సమావేశమయ్యారు. నిర్వాసితులు వారి సమస్యలను సీఎంకు వివరించారు.
అయితే, ఇటీవలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, టీడీపీ చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌లు సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. జయమంగళను చంద్రబాబు అప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. ఈ క్రమంలో జయమంగళ మళ్లీ టీడీపీలో చేరతారా? అనే చర్చ మొదలైంది.

ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయడంతో టీడీపీని వదిలి వైసీపీలో చేరారు జయమంగళ వెంకటరమణ. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి జయమంగళ రాజీనామా చేశారు. అయితే, మండలి ఛైర్మన్ దగ్గర ఇంకా అతని రాజీనామా పెండింగ్ లోనే ఉండటం గమనార్హం.
జయమంగళ వెంకటరమణ 1996లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 నుంచి టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జీగా పనిచేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 2023 ఫిబ్రవరిలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే, 2024, నవంబర్ 23న వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి జయమంగళ రాజీనామా చేసి జనసేనలో చేరారు.












Click it and Unblock the Notifications