ఇంకా కావాలా?: జెపి ఆవేశం, కిరణ్ రక్షణ కోసం రేవంత్
న్యూఢిల్లీ: ఉన్మాదులు, రాక్షసుల మాట వింటే ఆంధ్రప్రదేశ్ వల్లకాడు అవుతుందని, ఇంకా ఇలాంటి పార్టీలు కావాలా తేల్చుకోండని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ గురువారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం ఆయన ఆవేశంగా మాట్లాడారు. విభజనపై పార్టీలు డ్రామాలాడుతున్నాయన్నారు. వారసత్వ రాజకీయాలకు చెల్లుచీటి పలకాలని పిలుపునిచ్చారు.
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి పెళ్లయితే ఆయన వారసులు కూడా రాజకీయాల్లో చక్రం తిప్పుతారన్నారు. అన్ని పార్టీల్లోను వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆవేదన చెందారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలలో కుటుంబ సభ్యులదే హవా అని అభిప్రాయపడ్డారు.

సిఎంకు రక్షణ కల్పించాలని రేవంత్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రక్షణ పెంచాలని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లోకసభలో తెలంగాణ బిల్లు వల్ల ముఖ్యమంత్రి ఆందోళనకరంగా ఉన్నారని, ఆయన ప్రవర్తన అనుమానం కలిగిస్తోందన్నారు. బిల్లు పెడితే రాజీనామా చేస్తానని ప్రకటించిన కిరణ్ ఆత్మాహూతి చేసుకునే అవకాశం ఉందని, దానిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రక్షణ పెంచాలని కోరారు.
కాంగ్రెసు పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి లోక్‌సభలో బిల్లు ప్రవేశపెడితే, బిజెపి అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అద్వానీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, ప్రభుత్వ విప్ అనిల్ కుమార్ ఆరోపించారు. తెలంగాణకు వ్యతిరేకంగా బిజెపి నేతలు మాట్లాడటానికి, ఆ పార్టీ అగ్రనేతలను చంద్రబాబు ప్రభావితం చేయడమే కారణమని ఆరోపించారు.












Click it and Unblock the Notifications