లోకేష్ నోట జూ.ఎన్టీఆర్ పేరు: జగన్‌పై బాబు ఫైర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా మారినట్లే ఉన్నారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వచ్చి, రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికలపై ఆయన పవర్ ప్రజంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు నివాసంలో ఆయన పార్టీ యువ నేతలతో సమావేశమయ్యారు.
తాను చేపట్టనున్న యువ సదస్సులపై ఆయన ఈ సమావేశంలో చర్చించడంతో పాటు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి ఆయన నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. పార్టీ వైపు యువతను ఆకర్షించాల్సిన అవసరం ఉందని అంటూనే మాస్ ఓటర్లు పార్టీ వైపు వచ్చేలా తన తండ్రి చంద్రబాబు నాయుడు, తన మామ బాలకృష్ణలతో పాటు నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటారని ఆయన అన్నారు. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్ఎస్ఎఫ్) నాయకులతో ఆ మాటలన్నారు.
తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన చెప్పారు. అన్ని ప్రాంతాల్లో తాను పర్యటిస్తానని, ప్రాంతాలతో తనకు సమస్యలేదని ఆయన అన్నారు. తాను తెలంగాణలో పుట్టానని, తన కుటుంబం రాయలసీమలో ఉందని, తాను ఆంధ్ర అల్లుడిని అని ఆయన చమత్కరించారు.

నారా లోకేష్ వ్యాఖ్యలు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌తో రాజీ కుదిరిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నారా లోకేష్‌కు పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారనే కోపంతోనే జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ పార్టీకి దూరమైనట్లు ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ స్థితిలో పార్టీకోసం పనిచేస్తారంటూ హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పేర్లను కూడా లోకేష్ ప్రస్తావించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
జగన్‌పై చంద్రబాబు ధ్వజం
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. 13 జిల్లాలకు మాత్రమే పరిమితమైన జగన్ సమైక్యాంధ్ర నినాదం ఎలా ఇస్తారని ఆయన అడిగారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెసు పార్టీని భూస్థాపితం చేస్తామని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన అనేది రాజకీయ కుట్ర అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. పార్టీ మేధోమథన సదస్సులో ఆయన ప్రసంగించారు. తాము ఎదుర్కుంటున్న ప్రతి కష్టానికి కూడా కాంగ్రెసు పార్టీయే కారణమని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాగ్రెసు భూస్థాపితం కావడం ఖాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications