జూ ఎన్టీఆర్ పై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు -ఇల్లరికం అల్లుళ్లు ఎందుకు ..!!
మహానాడు అనేది ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు చేసేగొప్ప కార్యక్రమం.. అలాంటి కార్యక్రమాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని దుయ్యబట్టారు. మచిలీపట్నం మహానాడులో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. మినీ మహానాడు అంటూ రాష్ట్రమంతా తిరుగుతున్నారని ఎద్దేవా చేసారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారంటూ ఆరోపించారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలతో సంపదను పేదలకు అందిస్తుంటే...పంచుతున్నాడని మాట్లాడుతున్నారని తప్పు బట్టారు.

చంద్రబాబు - లోకేష్ పైనా
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రూ.8వేల కోట్లతో 16 మెడికల్ కాలేజీలు నిర్మిస్తుండటం అభివృద్ధి కాదా.. అంటూ ప్రశ్నించారు. 20వేల కోట్లతో నాడు-నేడు ద్వారా పాఠశాలలను ఆధునీకరిస్తే అభివృద్ధి కాదా అని నిలదీసారు.చదువుకున్న పిల్లలకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉద్యోగం కల్పించడం, ఆర్బీకే, వైయస్‌ఆర్ హెల్త్ క్లినిక్ ఇవన్నీ అభివృద్ధిగా కనిపించటం లేదా అంటూ కొడాలి నాని నిలదీసారు. లోకేష్ పైనా కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కొడుకు కరెక్ట్ పేరు సిద్దప్ప అంటూ ఎద్దేవా చేసారు.

జగన్ శ్రీకారం చుట్టారు
పేద పిల్లల చదువుల కోసం ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ, బైజూస్ వంటి విప్లవాత్మక కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అభ్యసించాలి. పేద పిల్లలు గ్రామాల్లో ఉండిపోకుండా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి ఉద్యోగం, వ్యాపారం చేసుకునేలా తీర్చిదిద్దుతున్నారు. మచిలీపట్నంలో పేర్ని నాని నిలబడినా.. ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి నిలబడినా అండగా నిలబడాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని, ఇల్లరికం అల్లుడిని (టీడీపీ కొల్లు రవీంద్ర) కాదని అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్
దీనికి కొనసాగింపుగా.. వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు.. అంతే కానీ మామా, అల్లుళ్లు కాదంటూ వ్యాఖ్యానించారు. వారసత్వమంటే వైఎస్సార్.. జగన్. సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అని విశ్లేషించారు. తొలి నుంచి నందమూరి కుటుంబంలో హరిక్రిష్ణ - ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ తో సత్సంబంధాలు ఉన్న కొడాలి నాని వైసీపీలోకి వచ్చిన తరువాత దూరం ఉంటున్నారు. మామ పేరు చెప్పుకునే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకంటూ కొడాలి నాని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు, బందరులో కొల్లు రవీంద్ర వంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించండంటూ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications