ఆస్కార్ జాబితాలో జూనియర్ NTR
ఈ ఏడాదిలో సినీ ప్రియులందరి కళ్లు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంపై ఉన్నాయి. ఎందుకంటే RRR సినిమా ఎంట్రీ అయింది కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఉత్తమ నటుడిగా ఎవరు విజయం సాధిస్తారా? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హాలీవుడ్ మ్యాగజైన్ 'వెరైటీ'ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ నటుడి జాబితాలో ఎన్టీఆర్ పేరు 'ఆస్కార్'కు నామినేట్ అయ్యే అవకాశం ఉందని ఈ మ్యాగజైన్ తన కథనంలో పేర్కొంది. విల్ స్మిత్, హ్యూ జాక్‌మన్ వంటి హాలీవుడ్ స్టార్స్ పేర్లతో ఉన్న ఈ జాబితాలో ఎన్టీఆర్ చోటు దక్కించుకోవడం పట్ల భారతదేశ సినీ ప్రియులతోపాటు తారక్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందని గతంలోనూ ఈ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన 'ఆర్‌ఆర్‌ఆర్'కు అన్ని ప్రాంతాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. సినీ ప్రియుల నుంచి వస్తోన్న ప్రేమాభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది జరగనున్న అకాడమీ అవార్డుల్లో పోటీ పడేందుకు జనరల్ కేటగిరీలో 'ఆర్‌ఆర్‌ఆర్' బృందం దరఖాస్తు చేసుకుంది. ఈ చిత్రం నుంచి నాటు నాటు పాట ఆస్కార్ ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగం షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకోవడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. జనవరి 12 నుంచి 17 వరకూ షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు అకాడమీ బృందం ఓటింగ్ నిర్వహించబోతోంది. ఆ ఓటింగ్‌ను ఆధారంగా చేసుకుని జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన చిత్రాల జాబితాను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12వ తేదీన ప్రేక్షకులను అలరించిన విజేతలకు ఆస్కార్ అవార్డులు అందించనున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు తనకు రావడానికి కారణమైన చిత్ర బృందానికి, నిర్మాణ సంస్థకు, తన కుటుంబానికి ఎప్పటికీ రుణపడి వుంటానని ఈ దర్శక ధీరుడు ప్రకటించారు.












Click it and Unblock the Notifications