చంద్రబాబు ప్లాన్: ఎపిలో జురోంగ్ మోడల్ అభివృద్ధి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లోని జురోంగ్ మోడల్ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సింగపూర్‌లోని జురోంగ్ దీవి కెమికల్ హబ్ ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో కెమికల్ హబ్‌ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆశిస్తున్నట్లు అర్థమవుతోంది.
తమ రాష్ట్రంలో అదే తరహాలో కెమికల్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి తాను జురోంగ్ దీవిని సందర్శించాలని అనుకుంటున్నట్లు చంద్రబాబు తనను కలిసి సింగపూర్ విదేశాంగ మంత్రి కె. షణ్ముగంతో చెప్పారు. నిజానికి జురోంగ్ కొన్ని దీవుల సమాహారం. ప్రసిద్ధమైన కంపెనీల పరిశ్రమలు అక్కడ ఉన్నాయి.

అవినీతి నిర్మూలనలోనూ ఉత్తమ పాలన అందించడంలోనూ తాను సింగపూర్ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలని అనుకుంటున్నట్లు చంద్రబాబు షణ్ముగంతో చెప్పారు. జురోంగ్‌లో వందకు పైగా ప్రముఖ పెట్రోలియం, పెట్రో కెమికల్, ప్రత్యేకమైన కెమికల్ కంపెనీలున్నాయి.
చంద్రబాబుకు సింగపూర్ బాగా తెలుసునని, సింగపూర్‌కు చంద్రబాబు చాలా కాలంగా మిత్రుడని, సింగపూర్ సాధించినవాటిని చంద్రబాబు అభిమానిస్తారని షణ్ముగం మీడియాతో అన్నారు. జురోంగ్‌ను చంద్రబాబు సందర్శించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
జురోంగ్‌లో బిఎఎస్ఎఫ్, సెలినీస్, ఎక్సోన్‌మొబైల్, డుపోంట్, మిత్సుయి కెమికల్స్, చెవ్రోన్ టెక్సాకో, షెల్, సుమిటోమో కెమికల్స్ ఉన్నాయి. సిఐబిఎ, హంట్స్‌మన్, నేచురల్ ఫ్యుయెల్, నెక్సోల్, టాటే అండ్ లైల్ కూడా ఉత్పత్తి సదుపాయాలను ఏర్పాటు చేశాయి.












Click it and Unblock the Notifications