బాబు నాయకత్వం వహిస్తే మేం సిద్ధం: పురంధేశ్వరిని లాగిన జ్యోతుల
విజయవాడ/ఏలూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే తమ పార్టీ ఎంపీలతో కలిసి కేంద్రం పైన ఒత్తిడి తీసుకు రావాలని వైసిపి నేత జ్యోతుల నెహ్రూ మంగళవారం నాడు డిమాండ్ చేశారు. కేంద్ర రైల్వే, సాధారణ బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
అయిదు రోజుల క్రితం ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్‌లో, సోమవారం ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఏపీకి ఆశించిన మేర నిధులు రాలేదు. దీనిపై వైసిపి నేతలు వరుసగా చంద్రబాబు పైన విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగా జ్యోతుల నెహ్రూ ఈ రోజు మాట్లాడారు.
స్వప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం వైసిపి రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడానికి తాము ఢిల్లీ వెళ్తామన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు నాయకత్వం వహిస్తే వైసిపి మద్దతు పలుకుతుందని చెప్పారు. ఈ విషయమై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని జ్యోతుల చెప్పారు. చంద్రబాబు తప్పులను అసెంబ్లీలో ఎండగడతామన్నారు.

గత ఏడాది రాజధానికి ఇచ్చిన రూ.1800 కోట్లు ఏం చాశారో చెప్పనందునే ఇప్పుడు నిధులు ఇవ్వలేదని బిజెపి నేత, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి చెప్పారని గుర్తు చేశారు. పోలవరం నిధులను పట్టిసీమకు ఖర్చు చేసినందుకే కేంద్రం పోలవరానికి నిధులు కేటాయించలేదన్నారు.
జగన్ మెప్పు కోసం రామచంద్రయ్య విమర్శలు: కాల్వ
చంద్రబాబు అవినీతి వల్లే ప్రత్యేక హోదా రావడం లేదని సీ రామచంద్రయ్య వ్యాఖ్యానించడంపై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు స్పందించారు. చంద్రబాబుపై సీ రామచంద్రయ్య అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. కేవలం జగన్ మెప్పు కోసం ఆయన చంద్రబాబును విమర్శిస్తారని ఎద్దేవా చేశారు. సి రామచంద్రయ్య పార్టీ మారేందుకు ఇక పార్టీలు కూడా లేవన్నారు.












Click it and Unblock the Notifications