చక్రం తిప్పుతున్న లోకేష్: జగన్‌కు ఎమ్మెల్యే షాక్, నెహ్రూ కొత్త ట్విస్ట్
రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూ చేరిక దాదాపు ఖాయమైంది. ఆయన టిడిపిలో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో.. టిడిపిలోని అసంతృప్త గళాలను బుజ్జగించే పనిలో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పడ్డారు.
నారా లోకేష్ తూర్పు గోదావరి జిల్లా నేతలతో ఆదివారం భేటీ అయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు పలువురు ముఖ్య నేతలను ఆయన పిలిపించుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. జ్యోతుల, ఆయన అనుచరుల రాకతో పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఇబ్బందులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ పటిష్టత కోసం తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని లోకేష్ వారికి సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకం పైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. జ్యోతుల నెహ్రూ రాకను కొందరు టిడిపి నేతలు వ్యతిరేకిస్తున్నారు. కానీ లోకేష్ బుజ్జగింపుతో తగ్గినట్లుగా తెలుస్తోంది.

మరికొంతమంది టిడిపిలోకి: గోరంట్ల
వైసిపి నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు టిడిపిలో చేరడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. వైసిపి నుంచి చాలామంది తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. త్వరలో వైసిపి ఉనికిపోతుందని నేతలు జాగ్రత్త పడుతున్నారన్నారు.
నెహ్రూ నేడో రేపో టిడిపిలోకి!
నేడో లేదా రేపు జ్యోతుల నెహ్రూ వైసిపి నుంచి టిడిపిలోకి మారే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. చెవిరెడ్డి భాస్కర రెడ్డి మధ్యవర్తిత్వం పని చేయలేదంటున్నారు. జగన్ మధ్యవర్తిగా చెవిరెడ్డిని పంపించారు. చెవిరెడ్డి వెళ్లగానే.. నియోజకవర్గ నేతలను, కార్యకర్తలను తన ఇంటికి పిలిపించిన జ్యోతుల వారితో మాట్లాడారు. వారితో చర్చించాక.. కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.
ట్విస్ట్ ఇచ్చిన జ్యోతుల
తాను పార్టీ మారతారని వస్తున్న వార్తలపై జ్యోతుల నెహ్రూ స్పందించారు. ప్రస్తుతానికి తాను పార్టీని మారటం లేదని చెప్పారు. ఆయన అనుచరుల్లో ఒకరైన వరుపుల సుబ్బారావు వైసిపిని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కాసేపటికే జ్యోతుల పార్టీని వీడటం లేదని చెప్పడం గమనార్హం. వైసిపిని వదిలి తెలుగుదేశంలో చేరే విషయమై తాను ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదన్నారు.
టిడిపిలోకి ఎమ్మెల్యే వరుపుల
జ్యోతుల నెహ్రూ అనుచరుడు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ.. తాను పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. టిడిపి నుంచి తనకు ఆహ్వానం అందిందని, ఆపై కార్యకర్తలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తన నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునేందుకే టిడిపిలో చేరుతున్నట్లు తెలిపారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి పనులకు తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు.












Click it and Unblock the Notifications