ఎఫ్‌డిసికి టీ షాక్: షేక్‌పేట భూములు స్వాధీనం
హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న సొసైటీ భూములపై తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా షేక్‌పేట పరిధిలోని ఆంధ్రప్రదేశ్ చలనచిత్రాభివృద్ధి సంస్థ (ఎపిఎఫ్‌డిసి) సంబంధించిన భూములను శనివారం తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డులను కూల్చివేసి తెలంగాణ ప్రభుత్వ బోర్డులను ఏర్పాటు చేశారు.
హైదరాబాదులోని ఫిలంనగర్‌లో చలన చిత్రాభివృద్ధి (ఎఫ్‌డిసి)కి కేటాయించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 16.48 ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకుంది. భూమి కేటాయించి మూడున్నర దశాబ్దాలు గడిచినా స్థలాన్ని వాడుకోకపోవడంతో ప్రభుత్వం ఆ చర్యకు దిగింది.
ఆ స్థలాన్ని వెనక్కితీసుకుంటూ శుక్రవారం సీసీఎల్‌ఏ సిన్హా ఉత్తర్వులిచ్చారు. మరో నాలుగు ఎకరాల్లో ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ఆ వెంటనే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకే మీనా ఆదేశాలతో క్షేత్రస్థాయి సిబ్బంది రంగంలోకి దిగారు. ‘ఈ స్థలం ప్రభుత్వానిది' అంటూ బోర్డులు పెట్టారు. ఒకప్పడు మద్రాసులో ఉన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు రప్పించడానికి, అప్పటి ప్రభుత్వం భూములు ఇచ్చింది, పలు ప్రోత్సహకాలు కూడా ఇచ్చింది.

అందులో భాగంగా 1982లో జీవో నెం.1015 ద్వారా షేక్‌పేట మండలం సర్వేనెం.403లో ఫిలింనగర్‌లో 50 ఎకరాల స్థలాన్ని ఎఫ్‌డీసీకి అప్పగించారు. ఎకరానికి రూ.8500లు మాత్రమే వసూలు చేశారు. ఇందులో పద్మాలయ స్టూడియోస్‌కు 9.5 ఎకరాలు, సురేష్ ప్రొడక్షన్స్‌కు 5 ఎకరాలు, ఆనంద్ సినీ సర్వీసెస్‌కు మరో 5 ఎకరాలు కేటాయించారు. పదెకరాలను హౌసింగ్ బోర్డుకు కూడా కేటాయించారు. ఆ రకంగా మరో 20 ఎకరాల భూమి ఖాళీగా ఉంది.
‘మీకు కేటాయించిన భూమిని రక్షించుకుంటారా? లేక మేం స్వాధీనం చేసుకోవాలా?' అంటూ 2013 జూన్‌లో హైదరాబాద్ జిల్లా యంత్రాంగం నోటీసులు ఇచ్చింది. అయినా ఎఫ్‌డీసీ అధికారులు పట్టించుకోలేదు. ఏడాది కిందట ల్యాండ్ ఆడిట్ చేయడంతో ఎఫ్‌డీసీ నిర్లక్ష్యం బయటపడింది. దాంతో ఎఫ్‌డీసీకి కేటాయింపులు రద్దుచేసి, భూమిని వెనక్కితీసుకోవడానికి అనుమతించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎంకే మీనా గత నెల 21, 27 తేదీల్లో సీసీఎల్‌ఏకు లేఖ రాశారు.
ఈ లేఖపై బుధవారం ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎల్‌ఎంఏ) సమావేశంలో చర్చించారు. భూమిని వెనక్కితీసుకోవాలని సిఫార్సు చేశారు. మూడెకరాలు వాణిజ్య పన్నుల శాఖకు ఎఫ్‌డీసీ నుంచి వెనక్కితీసుకున్న 16 ఎకరాల భూమిలో మూడెకరాలను వాణిజ్య పన్నుల శాఖ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు.












Click it and Unblock the Notifications