అమరావతిలో నారా లోకేష్‌కు సెగ
Nara Lokesh: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన వేళ.. రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి వలసల సెగ తాకుతోంది. ఈ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి మహాకూటమిగా ఏర్పడిన ఈ మూడు పార్టీల్లో సీట్ల పంపకాల వ్యవహారం చిచ్చు పెట్టింది.
పొత్తులో భాగంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేనకు వదలుకోవడం వల్ల ఏ స్థాయిలో నిరసన జ్వాలలు చెలరేగుతోన్నాయనేది తెలిసిందే. ఈ సెగ కాస్త చంద్రబాబునూ తాకింది. దీనిపై ఆయన దృష్టి పెట్టారు. పిఠాపురంలో పరిస్థితులు చక్కబెట్టడానికి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితులే తాజాగా సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో తలెత్తాయి. ఒకట్రెండు నియోజకవర్గాల టీడీపీ ఆశావహులు ఇప్పుడు టికెట్ల కోసం నిరసనలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు కాకుండా మరొకరిని ప్రోత్సహించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నేరుగా పార్టీ అధిష్ఠానానికే తమ అసమ్మతిని తెలియజేస్తోన్నారు.
జిల్లాలోని కదిరి నియోజకవర్గం టికెట్‌ను తెలుగుదేశం పార్టీ.. కందికుంట వెంకటప్రసాద్ భార్య యశోదా దేవికి కేటాయించిన విషయం తెలిసిందే. ఇది కాస్తా- మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా వర్గానికి మింగుడు పడట్లేదు. ఆయన అనుచరులు పెద్ద ఎత్తున అమరావతికి తరలివచ్చారు.

నారా లోకేష్ ఇంటి వద్ద నిరసన ప్రదర్శనలను చేపట్టారు. అక్కడే బైఠాయించారు. అత్తర్ చాంద్ భాషా బ్యానర్లను ప్రదర్శించారు. ఆయనకు టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో బయటికి వచ్చిన నారా లోకేష్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. చాంద్ భాషాకు టికెట్ ఇస్తే కదిరి నియోజకవర్గాన్ని బహుమతిగా ఇస్తామని అన్నారు.
దీనిపై నారా లోకేష్ స్పందించారు. కదిరిలో ఖచ్చితంగా గెలుస్తామని, టికెట్ పంపకాల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు అన్ని జాగ్రత్తలను తీసుకున్నారని అన్నారు. స్థానికుల నుంచి అందిన సర్వేల ఆధారంగానే టికెట్ ఇచ్చారని, ఇప్పుడు తానేమీ చేయలేనని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications