కడియం దళితుడే కదా: టిడిపి నేతలతో గవర్నర్
హైదరాబాద్: దళితుల నుంచి ఒక్కరికీ ప్రాతినిధ్యం లేని కె. చంద్రశేఖర రావు మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలని కోరుతూ మంగళవారం రాజభవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్, టిడిపి నేతల మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆధ్వర్యంలో పార్టీ దళిత నేతల బృందం గవర్నర్‌ను కలిసి ఒక వినతిపత్రం సమర్పించింది.
కెసిఆర్ మంత్రివర్గంలో దళితులు ఎవరూ లేరన్న టిడిపి నేతల వాదనపై గవర్నర్ స్పందిస్తూ - శ్రీహరి ఉన్నారు కదా అని అన్నారు. ‘ఆయన దళిత వర్గం కిందికి రారు. ఆయన బీసీ కులస్ధుడు.' అని మోత్కుపల్లి గవర్నర్‌తో చెప్పి, తన వద్ద ఉన్న సమాచారాన్ని వివరించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం రాజ్‌భవన్ వద్ద మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గంలోనే దళితులు, మహిళలకు చోటివ్వని సీఎం కేసీఆర్ హయాంలో రాజ్యాంగం కల్పించిన ఉద్యోగాలు, ఇతర రిజర్వేషన్ల అమల్లో ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.
సచివాలయం మార్పుపై మాట్లాడుతా..

సచివాలయం మార్పు అంశంపై తాను ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడతానని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ టిటీడిపి నేతలతో చెప్పారు. టీ టీడీపీ నేతలు మంగళవారం గవర్నర్‌ను కలిసి సచివాలయం మార్పును నిరసిస్తూ వినతిపత్రం ఇచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం విపరీత చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ వాటిని నిలువరించాలని టీ టీడీపీ నేతలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో సచివాలయం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిలువరించాలని, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సత్వరం జరిపించాలని కోరుతూ వారు గవర్నర్‌కు వినతిపత్రం అందచేశారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకచోటకు తీసుకువస్తామనే వాదనలో అర్ధం లేదని, ప్రస్తుతం వెయ్యి ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని తీసుకొచ్చి ఎర్రగడ్డలో ఉన్న అరవై ఎకరాల్లో ఎలా సర్దుబాటు చేస్తారని గవర్నర్‌తో భేటీ తర్వాత ఎల్. రమణ మీడియాతో అన్నారు. సీఎం తన సోకుల కోసం ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. వాస్తుదోషం నెపంతో సచివాలయాన్ని కూల్చి ఆ స్థలాన్ని తన బంధువులకు ఇచ్చి ఫైవ్ స్టార్ హోటల్‌ను నిర్మించాలని కేసీఆర్ భావిస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ తీసుకురావటం ఏమో గానీ కనీసం కేసీఆర్ మట్టి తెలంగాణనైనా మిగల్చాలన్నారు.
ఛాతి ఆసుపత్రి ఉన్న స్థలంలో పెద్ద పెద్ద భవనాలు నిర్మించేందుకు బేగంపేట ఏయిర్ పోర్టు అనుమతి లేదని టీటీడీపీ నేత పెద్దిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న సచివాలయానికి రెండు వీధి పోట్లు ఉంటే ఛాతీ ఆసుపత్రికి 15 వీధి పోట్లు ఉన్నాయని, దానిని ఎలా సమర్థించుకుంటావని కేసీర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications