TTD: శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం..!!
Tirumala: తిరుమలలో కార్తీక మాసం వేళ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిలో ఒక్క సారి మాత్రమే చోటు చేసుకునే అరుదైన కార్యక్రమం నేడు తిరమలలో ప్రారంభమైంది. కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది. అదే విధంగా ఈ నెల 18న తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది.
కైశిక ద్వాదశి
నేడు(బుధవారం) కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహిస్తున్నారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. కైశిక ద్వాదశిని ప్రబోధనోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంధాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు.

కార్తీక వనభోజనం
శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్ళారు. కైశికద్వాదశినాడు ఆయనను మేల్కొల్పు చేయడం రివాజు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది. అదే విధంగా, ఈ నెల 17న (ఆదివారం)న తిరుమలలో కార్తిక వనభోజనం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. చిన్న గజ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి పరువేట మండపానికి చేరుకుంటారు.
కార్తీక దీపోత్సవం
శేషాచల శ్రేణుల్లోని పచ్చని అడవుల్లో ఉన్న పార్వేట మండపానికి అమ్మవారు మరో పల్లకిపై ఊరేగింపుగా వస్తారు. గోగర్భం సమీపంలోని పార్వేట మండపంలో వనభోజన కార్యక్రమం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది.. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్నారు. టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 18వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.












Click it and Unblock the Notifications