పుకార్లు: మోడీ మంత్రివర్గంలో కెసిఆర్ తనయ కవిత?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో అంటీ ముంటనట్లూ ఉంటూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితమవుతున్నట్లు ఇటీవల వరుసగా వార్తాకథనాలు వస్తున్నాయి. టిఆర్ఎస్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరవచ్చునని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చేరుతారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
గత కొద్ది రోజులుగా ఇటువంటి ఊహాగానాలు చెలరేగుతున్నప్పటికీ కవిత గాని, ఇతర టిఆర్ఎస్ నాయకులు గానీ ఖండించకపోవడం విశేషం. పైగా, ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రులను కలిశారు. అంతేకాకుండా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధాన పాత్ర పోషిస్తున్న కేంద్ర వెంకయ్య నాయుడిని కూడా కెసిఆర్ కలిశారు. వెంకయ్యనాయుడిని కలిసి తర్వాతనే కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఘర్షణ వైఖరి మానుకున్నట్లు కూడా చెబుతున్నారు. ఈ స్థితిలోనే టిఆర్ఎస్ మోడీ మంత్రివర్గంలో చేరుతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఏప్రిల్ నెలలో నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశముందని ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అంతేకాకుండా రెండోసారి జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో టీఆర్‌ఎస్‌కు చోటు దక్కుతుందని, కేసీఆర్ కూతరు ఎంపీ కవితకు మంత్రి పదవి లభించనుందని రాజకీయంగా జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు జాతీయ మీడియా టైమ్స్‌నౌలో వచ్చిన ప్రసారాలు ఈ ఊహాగానలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని కూడా అంటున్నారు.
ఎన్డీయేలో చేరి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకుంటున్నామని గత కొద్ది రోజులుగా టీఆర్‌ఎస్ కూడా పరోక్ష ప్రచారం చేస్తోందని మీడియా కథనాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే టైమ్స్‌నౌ ప్రసారంతో టీఆర్‌ఎస్ వర్గాల్లో కలకలం రేగుతోంది. పార్టీలోని కొందరు టీఆర్‌ఎస్ ఎంపీలు ఈ విషయాన్ని రుచించుకోలేకపోతున్నారు.
అయితే, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బిజెపితో కెసిఆర్ పూర్తిగా జోడీ కడుతారా అనేది సందేహమే. అంతేకాకుండా, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బిజెపి చిత్తు కావడం కూడా కెసిఆర్ మదిలో ఉంటుందని అంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో చేరి మైనారిటీలను దూరం చేసుకునే పరిస్థితిని కెసిఆర్ తెచ్చుకుంటారని అనుకోవడానికి వీలు లేదని ఓ వర్గం అంటోంది. మజ్లీస్‌తో దూరదృష్టితో స్నేహం నెరుపుతున్న కెసిఆర్ ఒక్కసారిగా పూర్తిగా తన వైఖరిని మార్చుకుంటారని అనుకోవడానికి వీలు లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications