పవన్‌కు విషయాలు తెలియవు, కలిసివస్తే మంచిది: కంభంపాటి
న్యూఢిల్లీ: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రత్యేక హోదాపై చేసిన ఆరోపణలపై ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు స్పందించారు. ఏపికి ప్రత్యేక హోదా సాధించేందుకు పవన్ కళ్యాణ్ తమతో కలిసివస్తే మంచిదని అన్నారు.
న్యూఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా, అభివృద్ధి కోసం చేస్తున్న అంశాలు తెలియకే పవన్ అలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఏపీకి అధిక నిధులు వచ్చేలా ఆర్డినెన్స్ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టిడిపి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన పనులను మీడియాకు విడుదల చేశారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నామని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి అన్నారు. ఏపీకి కేంద్రం ఇంకా సాయం చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాయని కంభంపాటి పేర్కొన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు.
కాగా, రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు విఫలమయ్యారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఏపి ఎంపీలు ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు పోరాటం చేయడం లేదని, పార్లమెంటు గోడలు చూసి వస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications