ఫాక్షన్‌కు మారు పేరు కప్పట్రాళ్ల: సినిమాల్లో మాదిరే..
కర్నూలు: కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ముఠాకక్షలను చూస్తే ఇప్పటి సినిమాలు గుర్తుకు రాకమానవు. చంపుకోవడాలు, కొట్టుకోవడాలు రాజ్యమేలుతుంటాయి. అది ఫాక్షన్ కక్షలకు మారుపేరుగా మారింది. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు పడిన నేపథ్యంలో ఆ గ్రామం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అది నాలుగు దశాబ్దాలుగా కక్షలు, కార్పణ్యాలు, హత్యలు, ప్రతీకార హత్యలతో గ్రామం అట్టుడికిపోతోంది. ప్రత్యర్థుల తలలు తెగిపడుతున్నాయి. తమవారంతా జైళ్లతో మగ్గుతుంటే ఇళ్లవద్ద ఆడవారు కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థాకలితో అలమటిస్తున్నారు.
చేనేత కుటుంబానికి చెందిన వారం కిష్టప్ప సర్పంచ్‌గా, జిల్లా బోర్డు సభ్యుడిగా వంద ఎకరాల భూస్వామిగా చెలామణి అయ్యేవాడు. 1970లో కప్పట్రాళ్ళ వెంకటప్పనాయుడు గ్రామ సర్పంచ్‌గా గెలిచాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్రామంలో ఆధిపత్య పోరు మొదలైంది. యువకుడైన వెంకటప్పనాయుడు సర్పంచ్ కావడంతో జీర్ణించుకోలేకపోయిన కిష్టప్ప హత్యకు కుట్ర పన్నాడు. బహిర్భూమికి వెళ్లి వస్తున్న వెంకటప్పనాయుడుపై కిష్టప్ప అనుచరులు దాడి చేశారు. వెంకటప్పనాయుడు తప్పించుకున్నాడు.
దీంతో వారం కిష్టప్ప కుటుంబం ఇళ్లు, పొలాలు వదిలి గ్రామం వీడాల్సి వచ్చంది. వారం కిష్టప్ప పొలాలన్నింటినీ వెంకటప్పనాయుడు స్వాధీనం చేసుకున్నాడు. అలా ప్రారంభమైన పగలు, ప్రతీకారాలు చెలరేగుతూ వచ్చాయి. గ్రామాన్ని వీడానన్న బాధ, ఆవేదనతో వారం కిష్టప్ప మృతి చెందాడు. ఆయన వారసులు వెంకటప్పనాయుడుపై కక్షగట్టారు. వారం కిష్టప్ప కుమారుడు మునిరంగడు వెంకటప్పనాయుడును హతమార్చాందుకు సమయం కోసం వేచిచూశాడు. కర్నూలులో కోర్టుకు హాజరై వస్తున్న వెంకటప్పనాయుడుపై మునిరంగడు దాడి చేశాడు. ఆ దాడిలో వెంకటప్పనాయుడుకు తీవ్రగాయపడి కోలుకున్నాడు.
మరోసారి ఏకంగా పోలీసుల దుస్తుల్లో మోటర్ సైకిళ్లపై తన గ్యాంగ్‌తో వెళ్లి ఏకంగా వెంకటప్పనాయుడు ఇంటిపైనే బాంబులు వేశాడు. ఆ దాడిలో కూడా వెంకటప్పనాయుడు తప్పించుకున్నారు. ఇలా మునిరంగడు దాదాపు 12 సార్లు వెంకటప్పనాయుడుపై దాడికి పాల్పడ్డాడు. ప్రతిసారి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వెంకటప్పనాయుడు రాజకీయంగా అంతకంతకూ బలపడుతూ వచ్చాడు.

టిడిపి సీనియర్ నాయకుడు కెఇ కృష్ణమూర్తి అనుచరుడిగా దేవనకొండ మండలాన్ని శాసించేస్థాయికి ఎదిగాడు. 20 ఏళ్లక్రితం తుగ్గలి రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మునిరంగడు చనిపోయాడు.15 ఏళ్లక్రితం ఎన్నికల సమయంలో జిల్లేల బుడుకల గ్రామం వద్ద వెంకటప్పనాయుడును టార్గెట్ చేసి రోడ్డు మధ్యలో ల్యాండ్‌మైన్లు అమర్చారు. అదే సమయంలో వెంకటప్పనాయుడు కుడిభుజంగా వ్యవహరించిన బంధువు రంగప్పనాయుడుకు మధ్య వైరం పెరిగింది. ఈ వైరం చివరకు రంగప్పనాయుడును బలి తీసుకుంది.
2004లో పత్తికొండలో ఓ హోటల్‌లో భోజనం చేస్తుండగా రంగప్పనాయుడును హత్యచేశారు. దీంతో రంగప్పనాయుడు కుమారులు మద్దిలేటి నాయుడు, దివాకర్ నాయుడు, యోగేశ్వర్ నాయుడు కుటుంబం గ్రామం వదిలివెళ్లిపోయింది. వెంకటప్పనాయుడును చంపేందుకు మద్దిలేటి నాయుడు, అతని సోదరులు రాజకీయనాయకులను ఆశ్రయించారు. 2001లో వెంకటప్పనాయుడుపై ఇంటిలోనే బాంబులు వేసి దాడి చేశారు. దాడి తరువాత వెంకటప్పనాయుడు అనుచరులు ప్రత్యర్థులను వెంటాడి ఆరుగురిని హతమార్చారు. ఈ కేసులో ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది.
ఫాక్షనిస్టులకు కనువిప్పు
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు ఆయన అనుచరుల హత్య కేసులో ఆదోని కోర్టు ఇచ్చిన తీర్పు ఫ్యాక్షనిస్టులకు కనువిప్పుకావాలని కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ అన్నారు. కేసు విచారణ సమయంలో కోర్టులో ఉన్న ఎస్పీ తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈతీర్పు ప్రజలందరికీ ఒక గుణపాఠం అని అన్నారు. 17 మందికి యావజ్జీవ శిక్ష విధించడం వల్ల ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించేవారు, ఫ్యాక్షన్ తగాదాల్లో పాల్గొనేవారి గుండెల్లో గుబులు పుడుతుందన్నారు. చెప్పుడు మాటలు విని ఫ్యాక్షన్ హత్యల్లో పాల్గొంటే జీవితాలు జైలుపాలవుతాయన్న వాస్తవాన్ని గ్రహించాలన్నారు.
ఫ్యాక్షనిస్టుల మాటలు విని హత్యలకు పాల్పడితే కుటుంబాలు వీధిన పడుతాయన్న సత్యాన్ని ప్రతిఒక్కరు గ్రహించాలన్నారు. జిల్లాలో ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉందని, అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఎస్పీ కోరారు. ప్రజలు ఫ్యాక్షన్ జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో నిందితుడు మద్దిలేటినాయుడు తమ్ముడు దివాకర్‌నాయుడు పరారీలో ఉన్నాడని, ఆతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సర్పంచ్‌గా ఉన్న వ్యక్తి పరారు కావడం తగదన్నారు. కోర్టులో లొంగిపోవాలని ఎస్పీ సూచించారు.












Click it and Unblock the Notifications