తుని రూరల్ పోలీస్ స్టేషన్‌పై దాడి, నిప్పు, కానిస్టేబుల్ మృతి: డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
తుని: కాపు ఐక్యగర్జనకు వచ్చిన ఆందోళనకారులు తూర్పు గోదావరి జిల్లాలోని తుని రూరల్ పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో ఆదివారం జరిగిన కాపు ఐక్య గర్జన సభ హింసాత్మక పరిస్థితులకు దారి తీసింది. పోలీసు స్టేషన్ దాడి ఘటనలో ఓ కానిస్టేబుల్ మరణించినట్లు తెలుస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌పై ఆందోళనకారుల దాడి ఘటనలో రైలు డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఆందోళనకారులు రైలును ఆపి బోగీలపైకి ఎక్కుతుండటాన్ని గమనించిన డ్రైవర్ సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్ నిలిపివేయించాడు. పెనుప్రమాదం తప్పింది.

ఆందోళనకారులు ఓ బోగీకి నిప్పు పెట్టారు. ఒక బోగీ తర్వాత మరో బోగీకి మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై కిందికి దిగిపోయారు. మంటల తీవ్రతతో కాసేపటికే రైలు మొత్తం దగ్ధమైంది. ఆందోళనకారులను నియంత్రించేందుకు వచ్చిన నలుగురు రైల్వే సిబ్బంది గాయపడ్డారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయడం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సాధ్యం కాలేదు.
కాపు ఐక్యగర్జనకు వచ్చిన కార్యకర్తలు ఒక్కసారిగా రైల్‌రోకో, రాస్తారోకో చేపట్టడంతో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐక్యగర్జనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న పోలీసులు ఈ స్థాయిలో ఆందోళన జరుగుతుందని వూహించలేకపోయారు. ఒక్కసారిగా పరిస్థితి మారిపోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. వేలాదిమంది ఆందోళనకారులను అదుపు చేసేందుకు అదనపు బలగాలను తరలించారు.
ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఉన్నతాధికారులు చుట్టుపక్కల ప్రాంతాల పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు బలగాలను ఘటనా స్థలానికి పంపాయి. పోలీసులు పరిస్థితి అదుపు చేసేందుకు యత్నించగా, ఆందోళనకారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. పోలీసులపై దాడికి దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు.
తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న ఆందోళనలతో విశాఖ నుంచి ప్రారంభం కావాల్సిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. విశాఖ ఎక్స్‌ప్రెస్, గోదావరి ఎక్స్‌ప్రెస్, పూరీ-వోఖా ఎక్స్‌ప్రెస్, విశాఖ-కాకినాడ ప్యాసింజర్ రైళ్లు విశాఖ స్టేషన్‌లోనే నిలిచిపోయాయి. హౌరా-చెన్నై మెయిల్‌ను ఎలమంచిలి సమీపంలో నిలిపివేశారు.
ఫోటో: ఫేస్ బుక్ నుంచి...












Click it and Unblock the Notifications