పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగిన ముద్రగడ-వీధి రౌడీలా మాట్లడతారా ? టైం వేస్ట్ చేసుకోవద్దు..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలో వారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపై కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ను వీధి రౌడీతో పోల్చారు. ఎమ్మెల్యేలను విమర్శించి టైం వేస్ట్ చేసుకోవద్దని హితవు పలికారు. అంతేకాదు వారాహి యాత్రలో పవన్ చేస్తున్న పలు వ్యాఖ్యలకు ముద్రగడ కౌంటర్ ఇచ్చారు.
కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేసిన నేతలు రాజకీయంగా ఎదుగుతున్నారంటూ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ ఆయనకు ఓ లేఖ రాశారు. ఇందులో ముద్రగడ పలు విషయాల్ని ప్రస్తావించారు. తాను కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదగలేదన్నారు. అలాగే యువతను వాడుకుని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఉద్యమాలు చేయలేదని, చంద్రబాబు వల్ల పోగొట్టుకూన్న రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్ధితి చంద్రబాబు ద్వారానే పవన్ కల్పించారన్నారు.

తనకంటే బలవంతుడైన పవన్ కళ్యాణ్ ఉద్యమం చేపట్టి కాపులకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేకపోయారో చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. గతంలో జగ్గంపేట సభలో అప్పటి విపక్ష నేత జగన్ కాపులకు రిజర్వేషన్ కేంద్రం చేతుల్లో ఉందని చెప్పినప్పుడు తానేం చెప్పానో గుర్తుచేసుకోవాలని పవన్ కు సూచించారు. కాపులకు రూ.20 కోట్లు ఇస్తానన్నా వద్దన్నానని, బీసీల నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను, కాపుల నుంచి బొత్స సత్యనారాయణను సీఎం చేయమని అడిగినట్లు ముద్రగడ గుర్తుచేశారు.

మరోవైపు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన ఆరోపణల్ని కూడా తప్పుబట్టిన ముద్రగడ పద్మనాభం.. దమ్ముంటే ఆయనపై పోటీ చేసి గెలవాలని సూచించారు. తనను ముఖ్యమంత్రి చేయాలని పవన్ ఎలా అడుగుతారని కూడా ముద్రగడ ప్రశ్నించారు. 175 సీట్లకు పోటీ చేస్తే సీఎం చేయాలని అడగాలి తప్ప .. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని చెబుతూ తనను సీఎం చేయమని ఎలా అడుగుతారన్నారు.
మీ ప్రసంగాలలో పదే పదే తొక్క తీస్తా, నార తీస్తా, క్రింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారని,ఇప్పటి వరకూ ఎంతమందికి తీయించి, క్రింద కూర్చోబెట్టారో, గుండ్లు ఎంతమందికి చేయించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవివ్వాలి'' అంటూ ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications