సీమ గడ్డపై "మెగా" రాజకీయం : టీడీపీ - జనసేన పొత్తు వేళ : లెక్క మారుతోంది..!!
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగా టీడీపీ - జనసేన పొత్తు ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో, అటు వైసీపీ అప్రమత్తం అయింది. పవన్ కళ్యాణ్ ప్రభావంతో కాపు వర్గం ఓట్లు తమకు దూరం కాకుండా ఎలా ముందస్తు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా, వైసీపీ కాపు నేతలు రాజమండ్రి వేదికగా రేపు సమావేశం కానున్నారు. ఇదే సమయంలో రాయలసీమలో కొత్త సమీకరణం మొదలైంది.
రాయలసీమలో కొత్త సమీకరణాలు
గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన ఆ తరువాత ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా ఒకే వేదిక మీదకు వచ్చారు. ఇందుకు తిరుపతి వేదిక అయింది. ప్రజారాజ్యంలో పని చేసి ప్రస్తుతం వైసీపీలో చేరిన వారు మినహా మిగిలిన నేతలంతా కలిసి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. పవన్ లక్ష్యంగా వైసీపీ కాపు నేతలు సమావేశం నిర్వహిస్తున్నారనే వార్తల నేపథ్యంలో, రాయలసీమ కు చెందిన బలిజ సామాజిక వర్గానికి చెందిన మెజార్టీ నేతలు ఈ సమావేశంలో పాల్గొనటం రాజకీయంగా సంచలనానికి కారణమవుతోంది. టీడీపీలోని బలిజ సామాజిక వర్గ నేతలు చొరవతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నిర్వహిస్తున్న కాపు నేతల సమావేశాల ద్వారా ఆ వర్గ ఓటర్లు తమ చేజారి పోకుండా ముందస్తు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

టీడీపీ - జనసేన పొత్తు వార్తలతో
ముఖ్యమంత్రి జగన్ కు గట్టి పట్టు ఉన్న సీమ ప్రాంతంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న బలిజ వర్గ నేతల సమావేశం ఇప్పుడు కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. టీడీపీ - జనసేన పొత్తు వార్తల నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఈ సమావేశానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాల్లోనూ ఇదే రకమైన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా చిరంజీవి కొద్ది రోజుల క్రితం తాను తమ్ముడు పవన్ కు మద్దతుగా నిలుస్తానని చెప్పటం..వీరంతా గతంలో చిరంజీవి నాయకత్వంలో ప్రజారాజ్యంలో పని చేసిన వారు కావటంతో, వీరి మద్దతు వచ్చే ఎన్నికల్లో జనసేనకు దక్కే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి.

వైసీపీ కాపు నేతల సమావేశం వేళ
దీంతో, ఈ సమావేశాలతో వైసీపీ అప్రమత్తం అవుతోంది. ఇదే సమావేశంలో రాజకీయంగా గతంలో యాక్టివ్ గా ఉంది, ప్రస్తుతం దూరంగా ఉంటున్న వారు కూడా హాజరయ్యారు. భారీ సంఖ్యలో బలిజ సామాజిక వర్గ నేతలు హాజరు కావటంతో పాటుగా వారు తీసుకొనే నిర్ణయం రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. వైసీపీలోని బీసీ నేతల సమావేశం.. రేపు కాపు వర్గీయుల భేటీ నేపథ్యంలో, ఇప్పుడు జరుగుతన్న సమావేశాలతో..వచ్చే ఎన్నికలు పూర్తిగా సామాజిక సమీక"రణం" గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications