లైన్ క్లియర్: ఏపీ కాదు, కర్ణాటక నుంచే రాజ్యసభకు వెంకయ్య
న్యూఢిల్లీ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. ఇప్పటిదాకా కర్ణాటక కోటా నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్న వెంకయ్యకు ఈ దఫా ఆ రాష్ట్ర కోటా నుంచి టికెట్ లభించే అవకాశాలు లేవన్న వదంతులు ఇటీవల వినిపించాయి.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న వెంకయ్యను మరోమారు రాజ్యసభకు పంపించాల్సిందేనని కూడా పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక కాకుండా వేరే రాష్ట్రాల వైపు చూసింది. ఈ క్రమంలో ఏపీ సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల పేర్లు కూడా వినిపించాయి.
అయితే వెంకయ్యను మరింత టెన్షన్‌కు గురి చేసే విషయానికి సంబంధించి వీలయినంత త్వరగా చెక్ పెట్టాలని భావించిన బీజేపీ జాతీయ నాయకత్వం... కర్ణాటక పార్టీ శాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పతో మాట్లాడింది. మరోమారు వెంకయ్యకు కర్ణాటక నుంచే అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కర్ణాటక నుంచే రాజ్యసభకు మరోమారు పంపాలని కర్ణాటక రాష్ట్ర బిజెపి కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. కర్ణాటక నుంచి వెంకయ్యనాయుడు ఇప్పటి వరకు మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఈసారి ఒక కన్నడిగునికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారమిక్కడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమితి సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానంద గౌడ, మాజీ మంత్రులు అశోక్, ఈశ్వరప్ప, జగదీశ్ శెట్టర్, ప్రహ్లాద్ జోషి తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేరును ఖరారు చేశామని, పార్టీ కేంద్ర ఎన్నికల సమితికి ఆయన పేరును సిఫార్సు చేస్తూ లేఖను పంపుతున్నామని తనను కలుసుకున్న విలేకరులకు యడ్యూరప్ప తెలిపారు.












Click it and Unblock the Notifications