నిజాంనే తరిమేశాం కిరణెంత, బ్యాట్ పడ్తే బాంబులే: కవిత
హైదరాబాద్: తెలంగాణను ఆపేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆఖరుగా బ్యాట్ పట్టుకుంటే తెలంగాణ మహిళలు ఆ ఆఖరు బంతులకు బదులు బాంబులు విసురుతారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం అన్నారు. తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష ప్రారంభమైంది. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.
తెలంగాణపై అందరికంటే ముందు మాట్లాడింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డే అని, దీనిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుర్తుంచుకోవాలన్నారు. పరకాల ఉప ఎన్నిక సమయంలో తాము తెలంగాణ ప్రజల సెంటిమెంట్ గౌరవిస్తామని విజయమ్మ, షర్మిలలు చెప్పారన్నారు. నిజాంనే తరిమేసిన తెలంగాణవారికి కిరణ్ ఓ లెక్క కాదన్నారు.

ఆంక్షలు లేని తెలంగాణ విషయంలో తాము కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తానా అంటే విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ తందానా అంటున్నారని విమర్శించారు. తెలంగాణ నేతలు గెలిస్తే భావోద్వేగం, సీమాంధ్రలో గెలిస్తే ఉద్యమమా అని కవిత సీమాంధ్ర మీడియాను ప్రశ్నించారు. ఎపిఎన్జీవో అధ్యక్షుడిగా అశోక్ బాబు గెలిస్తే సీమాంధ్ర మీడియా ఆకాశానికి ఎత్తిందన్నారు.
శ్రీధర్ బాబుపై కవిత మండిపాటు
విద్యార్థుల శవాలపై ప్రమాణం చేసి రాజీనామా చేయని శ్రీధర్ బాబు ఇప్పుడు చేసినంత మాత్రాన ఉద్యమకారుడు కాలేరని కవిత అన్నారు. శ్రీధర్ బాబు తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లుందన్నారు. నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి కాదన్నారు. శ్రీధర్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు ఇవ్వకుండా జానా రెడ్డికి, ముఖ్యమంత్రికి ఇవ్వడమేమిటన్నారు. తెలంగాణ మంత్రులు ఇప్పటికైనా పౌరుషం చూపించాలని, శ్రీధర్ బాబు శాఖను మార్చినప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు. చర్చ జరిపించలేని మంత్రులు రాజీనామా చేయాలన్నారు.












Click it and Unblock the Notifications